Breaking News

20/04/2019

6.2 అడుగుల కనిష్ఠ స్థాయికి నీటి మట్టం

విజయవాడ, ఏప్రిల్ 20, (way2newstv.in)
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చే బ్యారేజీ వద్ద కృష్ణానది నీటి మట్టం గతంలో ఎన్నడూలేని విధంగా కనిష్ఠ స్థాయికి అడుగంటింది. పట్టిసీమ ద్వారా కృష్ణానదిలోకి వచ్చే గోదావరి జలాలు కూడా నిలిచిపో యాయి. ఫలితంగా బ్యారేజీలో ఇసుక తిన్నెలు బయటకు కనిపిస్తున్నాయి. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు దుర్గాఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కూడా నీరు లేని పరిస్థితి.ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో 13.8 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. బ్యారేజీకి ఎడమ వైపున ఉన్న కృష్ణా తూర్పు ప్రధాన కాలువ ద్వారా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు, కుడివైపున ఉన్న కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పంటల సాగు, ప్రజల తాగునీటి అవసరాల కోసం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు, రైతులు ఈ నీటిపై ఆధారపడే పంటలు సాగు చేసుకుంటూ, తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.


6.2 అడుగుల కనిష్ఠ స్థాయికి నీటి మట్టం

ప్రస్తుతం బ్యారేజీలో నీటిమట్టం కనిష్ఠ స్థాయికి పడిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తుండటంతో కాలువల ద్వారా నీటిని విడుదల చేయలేని పరిస్థితి. దీంతో ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు బోర్లపై ఆధారపడుతూ నానా కష్టాలు పడుతున్నారు. ప్రజలు కూడా తాగునీటి అవసరాలకు బోర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు కూడా అథఃపాతాళంలోకి వెళ్లిపోయాయి. ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో (జూన్ నెలలో) వర్షాలు బాగానే కురిశాయి. ఆ తర్వాత నుంచి వర్షాల జాడే లేదు. జిల్లాలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 996.7 మి.మీ. కాగా  ఈ ఏడాది 800.5 మి.మీ మాత్రమే కురిసినట్లు జల గణన అధికారులు చెబుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు ప్రస్తుత వేసవి తాపంతో భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. దీంతో జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో ఎంత లోతుకు బోర్లు వేస్తున్నా నీరు పడకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు, రైతులు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు.ప్రకాశం బ్యారేజీ దగ్గర గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 12 అడుగులు. నిరుడు ఇదే సమయానికి 11.6 అడుగులు ఉంది. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కృష్ణానదిలో నీటిమట్టం 5.4 అడుగుల మేర తగింది. ఎండ తీవ్రతకు రోజుకు ఒక సెంటీమీటరు చొప్పున నదిలో నీరు ఆవిరైపోతోంది. నగరంలో ఈ నీటినే సరఫరా చేయడం కారణంగా కృష్ణానదిలో నీటిమట్టం నానాటికీ దిగజారిపోతోంది. ఏప్రిల్‌లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మే, జూన్‌లలో పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

No comments:

Post a Comment