Breaking News

05/03/2019

ప్రతిపక్షాల అనైక్యతే...మోడీకి బలం

న్యూఢిల్లీ, మార్చి 5, (way2newstv.in)
అందరూ స్నేహితులే. కానీ కలసి నడవటానికి ఇష్టపడటంలేదు. ఇదీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి. లోక్ సభ ఎన్నిలకు ముందే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలన్న విపక్షాల ఐక్యత ముందే దెబ్బతినేలా ఉంది. నరేంద్ర మోదీకి మరోసారి ప్రధాని పదవి దక్కకుండా చేయాలని విపక్షాలు గట్టిగానే అనుకున్నాయి. ఇందుకోసం పలుమార్లు సమావేశమయ్యాయి. దాదాపు 21 పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసి మోదీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో షాక్ ఇవ్వాలని నిర్ణయించాయి. ప్రధాని అభ్యర్థిని ముందుగానే ప్రకటించకుండా బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కలసి లోక్ సభ ఎన్నికల్లో సమిష్టిగా పోరాడాలని ప్రతిన కూడా పూనాయి. ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. ఒకవైపు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో పొత్తులతో దూసుకుపోతోంది. మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, పంజాబ్ లలో పొత్తులను లోక్ సభ ఎన్నికలకు ముందే కుదుర్చుకుంది. కానీ కూటమికి పెద్ద దిక్కుగా ఉన్న కాంగ్రెస్ మాత్రం పొత్తులను కుదుర్చుకోవడంలో చతికలపడుతోంది. 


 ప్రతిపక్షాల అనైక్యతే...మోడీకి బలం

ఎక్కడా దానితో కలసి వచ్చే పార్టీలు కన్పించడంలేదు. ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా కూటమిలో ఉండటంతో వారి రాష్ట్ర ప్రయోజనాలతో పాటుగా, వారి పార్టీల క్యాడర్ ను కాపాడుకోవడానికి ప్రాధాన్యత నిస్తుండటంతో కాంగ్రెస్ తో కలసి నడిచేందుకు ఇష్టం చూపడం లేదు.ఉత్తరప్రదేశ్ లో మాయావతి, అఖిలేష్ యాదవ్ లు కాంగ్రెస్ ను దెబ్బతీశారు. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, ఆర్ఎల్డీలు కలసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళుతున్నాయి. మధ్యప్రదేశ్ లోనూ మాయావతి, అఖిలేష్ లు సొంతంగా పోటీ చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేసే పరిస్థితి కన్పించడం లేదు. విభజన చేసిన పాపాన్ని కాంగ్రెస్ మూట కట్టుకోవడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ ను పక్కన పెట్టి ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలైన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్ వంటి వారిని కూడా తన పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ ను దెబ్బతీశారు.ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కు చుక్కెదురయింది. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో కలసి నడుస్తుందనుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి శత్రువైనప్పటికీ బద్ధ శత్రువైన బీజేపీని ఎదుర్కొనాలంటే కాంగ్రెస్ తో కలసి నడవాలని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావించారు. కానీ కాంగ్రెస్ చేతకాని తనంతో ఇక్కడ కూడా పొ్త్తును కోల్పోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఢిల్లీ పరిధిలో ఉన్న ఏడు లోక్ సభ స్థానాలకు ఆరు స్థానాలకు తన అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. మొత్తం మీద చుట్టూ స్నేహితులున్నట్లు కన్పిస్తున్నా కాంగ్రెస్ మాత్రం ఒంటరిగానే మిగిలింది.

No comments:

Post a Comment