కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
మార్చి 28 సాయంత్రం 4 గంటలలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ మార్చ్ 25 (way2newstv.com)
ఎన్నికల్లో వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపును ఎందుకు పెంచట్లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 50శాతం మేర ఓటు రసీదు యంత్రాలను(వీవీప్యాట్‌లను) లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాల దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈసీ తీరుపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.ప్రస్తుతం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఈవీఎంను మాత్రమే వీవీప్యాట్ స్లిప్పులతో లెక్కించి సరిచూస్తున్నారు. అయితే ఈ స్లిప్పుల లెక్కింపును ఎందుకు పెంచలేకపోతున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి ఈసీ తరఫున కోర్టుకు హాజరైన సుదీప్ జైన్ స్పందిస్తూ.. ప్రత్యేక కారణాల వల్లే లెక్కింపు పెంచడం లేదని తెలిపారు. అయితే ఇదే సమాధానంతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపును ఎందుకు పెంచట్లేదు
‘వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపును పెంచాలనుకుంటున్నారా? ఒకవేళ పెంచకపోతే స్లిప్పుల లెక్కింపులో ఈసీకి ఉన్న ఇబ్బందులను తెలియజేస్తూ మార్చి 28 సాయంత్రం 4 గంటలలోగా అఫిడవిట్ దాఖలు చేయండి’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రక్రియతో మీరు సంతృప్తిగా ఉంటే అందుకు గల కారణాలు కూడా తెలియజేయాలని పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా 50శాతం మేర వీవీప్యాట్‌లను లెక్కించి, వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చేలా నిబంధనలు తీసుకురావాలని 21 రాజకీయ పార్టీలు గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎస్పీ, బీఎస్పీ ఎంపీలు రాంగోపాల్‌యాదవ్, సతీష్ చంద్ర మిశ్రల నేతృత్వంలో 21 పార్టీల నేతలు ఫిబ్రవరి 4న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా, కమిషనర్ అశోక్ లవాసాలను కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే ఈసీ నుంచి సంతృప్తికర స్పందన లేకపోవడంతో వీరంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
No comments:
Post a Comment