Breaking News

11/03/2019

విశాఖలో సామాజిక లెక్కలు...

విశాఖపట్టణం, మార్చి11, (way2newstv.in)
మన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ముందే అందరికీ అన్నీ గుర్తుకువస్తాయి. రాజకీయ నాయకులకు ఓట్లు కావాలి కాబట్టి వారు అపుడు తలచుకున్నా ఆశ్చర్యం లేదు కానీ సమాజంలోని మిగతా వారు కూడా అయిదేళ్లకు ఓమారే తమ సమస్యల చిట్టా విప్పడమే అసలైన చిత్రం. ఈ మధ్యలో జనాలను, వారి బాధలను వదిలేసిన వారు ఇపుడు పనిగట్టుకుని మరీ ప్రేమ ఒలకబోడం వెనక స్వీయ ప్రయోజనాలే తప్ప మరేమీ లేవు. విశాఖ జిల్లాలో ఇపుడు కుల సంఘాల మీటింగులు ఓ స్థాయిలో జరుగుతున్నాయి. ప్రతీ కులం తమకు ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇస్తారని అడుగుతోంది. టికెట్లు ఇచ్చిన వారికే ఓట్లేస్తామని ఖరాఖండీగా చెప్పేస్తోంది. అన్ని రాజకీయ పార్టీలకు కలిపి మరీ డెడ్ లైన్లు పెట్టేస్తోంది.విశాఖలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సామాజిక వర్గం తమదని రెడ్లు అంటున్నారు. దశాబ్దాలుగా విశాఖలో ఉంటూ అన్ని విధాలుగా జనంతో మమేకం అయ్యామని, గతంలో రాజకీయంగా కూడా కీలకమైన పాత్ర వహించామని చెబుతున్నారు. 


విశాఖలో  సామాజిక లెక్కలు...


జనాభాపరంగా చూసుకున్నా తాము మంచి నిష్పత్తిలోనే ఉన్నామని కూడా చెబుతున్నారు. తమకు అన్ని రాజకీయ పార్టీలు దామాషా ప్రాతిపదికన ఈసారి టికెట్లు ఇవ్వాల్సిందేనని గట్టిగా కోరుతున్నాయి. విశాఖలో ఒక్క కాంగ్రెస్ మాత్రమే రెడ్లకు న్యాయం చేసిందని చెప్పుకొస్తున్నారు. ఇపుడు ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీ, జనసేన తమ డిమాండ్లకు హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామని కూడా అంటున్నాయి. ఈ మేరకు తాజాగా మీటింగ్ పెట్టి మరీ రెడ్ల సంఘం నాయకులు అల్టిమేటం జారీ చేశారు.మత్స్యకారుల సంఘం నేతలు కూడా మీటింగు పెట్టారు. తమకు ఈసారి తగిన న్యాయం చేసిన పార్టీకే ఓటు వేస్తామని నాయకులు ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. తమకు ఎంపీ, ఎమ్మెల్యే పదవులు పొందేందుకు అన్ని హక్కులూ ఉన్నాయని కూడా బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. సీటు ఇవ్వకపోతే ఓండిచి తీరుతామని కూడా హెచ్చరిస్తున్నారు. విశాఖ దక్షిణం, భీమిలీల్లో మత్స్యకారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అక్కడ సీట్లను వారు గట్టిగా కోరుతున్నారు. ఐతే టీడీపీ, వైసీపీ వారికి ఇంతవరకూ టికెట్ హామీ ఇవ్వలేదు. దాంతో వారు బయటకు వచ్చి మరీ హెచ్చరికలు పంపుతున్నారు. అదే దారిలో బ్రాహ్మణ సంఘం నేతలు కూడా ఉత్తరాంధ్రలోని ప్రతి జిల్లాలో మీటింగులు పెట్టి తమకు సీట్లు ఇవ్వాలని కోరడం విశేషం. గతంలో విశాఖ ఎంపీ, ఎమ్మెల్యే తమ వారు ఉండేవారని, ఇపుడు కనీసం పట్టించుకోవడం లేదని బ్రాహ్మణ సంఘం నేతలు వాపోతున్నారు. ఇక మైనారిటీలు కూడా ఈసారి టికెట్లు తమకు ఇవ్వలాని అన్ని పార్టీలను కోరుతున్నారు. మరి చూడాలి ఏ పార్టీ వారి డిమాండ్లకు తలవొగ్గుతుందో, మరే పార్టీ అగ్గి రాజేస్తుందో.

No comments:

Post a Comment