Breaking News

27/03/2019

మండిపోతున్నాయ్..! (హైదరాబాద్)

హైదరాబాద్, మార్చి 27 (way2newstv.in): 
ఎండలతో పాటు కూరగాయల ధరలూ మండుతున్నాయి. కాదు.. కాదు మండిస్తున్నారు. పంట పద్ధతులు మార్చినా, అన్ని కాలాల్లో మంచి దిగుబడి వచ్చే వంగడాలు వచ్చినా.. ఎండా కాలం రాగానే ధరలు పెంచేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో కూరగాయల పంట దిగుబడులు భారీగా తగ్గినా పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. వర్షాకాలంతో పోల్చితే నగరానికి వస్తున్న కూరగాయలు కొద్దిగా తక్కువే. నగరంలోని వివిధ మార్కెట్ల మాయాజాలంతో వినియోగదారుడు ఆగమైపోతున్నారు. అందుకు వివిధ మార్కెట్లలో కూరగాయల ధరల వ్యత్యాసమే నిదర్శనం.
వరి పంటలు అయ్యాక పొలాల్లో కూరగాయల సాగు ప్రారంభం అవుతుంది. బావుల వద్ద కూరగాయల పంటలు సాగవుతున్నాయి. వీటికి తోడు పాలీ హౌస్‌, గ్రీన్‌ హౌస్‌ పేరిట చలువ పందిళ్లు వేసి.. ఆధునిక పద్ధతుల ద్వారా పండిస్తున్నారు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలు ఇంకా రానేలేదు. 


మండిపోతున్నాయ్..! (హైదరాబాద్)

మార్చిలోనే ధరలు పెంచేశారు. హోల్‌సేల్‌ మార్కెట్లో కిలో టమాటా రూ.12 ఉంటే.. రైతు బజార్లలో రూ.15కు విక్రయిస్తున్నారు. సూపర్‌ మార్కెట్లు, కాలనీల్లోని కూరగాయల చిరు వ్యాపారులు రూ.18 నుంచి రూ. 20కి తక్కువ లేకుండా అమ్మేస్తున్నారు. ఆలుగడ్డ కిలో హోల్‌సేల్‌ ధర రూ.13 ఉంటే.. రైతు బజారులో రూ. 16 ఉంది. బయటి మార్కెట్లో రూ.22కు పైగా విక్రయిస్తున్నారు. ఇలా నగరానికి వచ్చే సరికి సాధారణ ధరలున్న కూరగాయలు.. మార్కెట్లోకి తరలేసరికి ఆకాశాన్ని అంటుతున్నాయి.
వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ప్రతి రోజు కూరగాయల ధరలను నిర్ణయించడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. ఉదాహరణకు హోల్‌సేల్‌ మార్కెట్లో కిలో టమాటా కేవలం రూ.5 నుంచి 8 లేదా 10 ఉంటే.. అక్కడే రూ.12 అంటూ మార్కెటింగ్‌ శాఖ నిర్ధేశిస్తోంది. అదే టమాటా రైతు బజారుకు వచ్చేసరికి రూ.15 నుంచి 16గా చెబుతున్నారు. రిటైల్‌ అమ్మకాల్లో రూ. 18 నుంచి రూ.20 వరకు ఉంటోంది. కేవలం ఎండ బూచి చూపి స్థానిక మార్కెట్‌ వ్యాపారులు, బడా దుకాణదారులు ఇష్టానుసారం ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు.
నగరంలోని కోటి జనాభాకు ప్రతి రోజు 35 లక్షల కిలోల కూరగాయలు అవసరం. హోల్‌సేల్‌ మార్కెట్లకు 20 నుంచి 25 లక్షల కిలోల వరకూ వస్తున్నాయి. మిగతావి నేరుగా దుకాణాలకు చేరుతున్నాయి. వేసవి కాలంలో 5 నుంచి 10 లక్షల కిలోల వరకూ కొరత ఉంటుంది. హోల్‌సేల్‌ ధరలకు కిలోకి అదనంగా రూ.3 లేదా 5వరకు పెంచి అమ్మాలి కాని.. ఏకంగా రైతు బజార్లలోనే హోల్‌సేల్‌ ధరకు రూ.10 ఎక్కువ చూపుతున్నారు. రైతు బజార్లే ఇలా ఉంటే బయటి మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఏ కూరగాయలైనా కిలోకి రూ.50కి పైనే పలుకుతున్నాయి.

No comments:

Post a Comment