విజయవాడ, మార్చి 4, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు వ్యవహారం దుమారం రేపుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య వేడిని రాజేసింది. టీడీపీ తమ ఓట్లను తొలగిస్తోందంటూ వైసీపీ కొన్నాళ్లుగా ప్రచారం చేస్తోంది. దీనిపై ఈసీని కూడా ఆశ్రయించింది. అయితే ఇదంతా నాటకమేనని గ్రామస్థాయిలో టీడీపీ ఓట్లనే తొలగిస్తున్నారని, దీని వెనుక వైసీపీ కుట్ర ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇదే అంశాన్ని టెలీకాన్ఫరెన్స్‌లో నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొందరు టీడీపీ ఓట్లను తొలగించే కుతంత్రాలు చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. సైబర్ క్రైమ్ నేరస్తులంతా కుమ్మక్కై ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల తొలగింపు కుట్ర చేస్తున్నవారిని వదలవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. మంత్రి లోకేష్ కూడా ఇదే అంశంపై ట్వీట్ చేశారు. ప్రతి గ్రామంలోనూ టీడీపీ ఓట్లను తొలగించేందుకు వైసీపీ యత్నిస్తోందని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో గతంలో ఉన్న ఓట్లు, తాజా ఓటర్ల లిస్టులో తొలగించిన తర్వాత ఓటర్ లిస్టులను ఆయన మీడియాకు చూపించారు.
ఏపీలో ఓట్ల తొలగింపు రాజకీయం
ప్రతి మండలంలోనూ టీడీపీ ఓటర్లను కుట్రపూరితంగా తొలగించారని, సైబర్ నేరానికి పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.రెండు రోజుల క్రితం, ఒకే రోజు 5 వేలు ఓట్లు తొలగించారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రమ్రంతా ఓట్లు తొలగింపుపై ఒకేసారి లక్షల్లో అభ్యంతరాలు ఇంటర్నెట్ ద్వారా ఎన్నికల అధికారులకు చేరాయి. దీంతో జిల్లా ఎన్నికల అధికారులు సైబర్‌క్రైం జరిగినట్టు గ్రహించి ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకువెళ్లడంతో ఏపీ అంతటా ఓట్లు తొలగింపు అలజడి ఆరంభమైంది. 13 జిల్లాల్లో 5 లక్షల 20 వేల ఓట్లు ఫారం-7 ద్వారా డిలీషన్ కోసం 24 గంటల్లో అప్‌లోడ్ కావడం పట్ల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 32000 ఓట్లు ఒక్కరోజులో తొలగింపునకు ఫారం-7 అప్‌లోడ్ కావడం గమనార్హం. ఈ పేర్లు ఓటరు జాబితా నుండి తొలగించాలంటూ తమకు అభ్యంతర పత్రం వచ్చిందంటూ యంత్రాంగం.. మరోపక్క అభ్యంతరం వ్యక్తం చేసిన పత్రంలో సిఫార్సు చేసిన వారి పేర్లు కూడా స్థానికులదే కావడం.. ఇదే విషయమై అధికారులు విచారణతో గ్రామాల్లో ఓట్లు తొలగించే ఫారమ్-7 పెను అలజడినే సృష్టించింది.ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే ఓట్ల తొలగింపు కోసం హైదరాబాద్ లోని ప్రైవేటు ఐటీ కంపెనీలను టీడీపీ ఆశ్రయించిందన్న వార్తలు కలకలం రేపుతుండగా... తాజాగా ఈసీ 9 జిల్లాల్లో 45 కేసులు నమోదు చేయడం పరిస్ధితి తీవ్రతకు అద్దంపట్టేలా ఉంది. ఏపీలో ఎన్నికల వేళ ఫామ్ 7 ద్వారా ఆన్ లైన్ లో ప్రత్యర్ధుల ఓట్ల తొలగింపునకు రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఈ తతంగం అంతా ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న మీ సేవా కేంద్రాల ద్వారానే ప్రధానంగా సాగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఓటర్ల జాబితాలో తమ పేరు లేదా ఇతరుల పేర్లు పొరబాటుగా లేదా ఉద్దేశపూర్వకంగా చేర్చారన్న ఫిర్యాదు చేసేందుకు ఈ ఫామ్ 7 వినియోగిస్తారు. అయితే, ఇది మునుపెన్నడూ లేనంతగా తీవ్ర స్ధాయిలో దుర్వినియోగం అవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం, వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర పోటీ తప్పదన్న అంచనాలే. దీంతో ఆయా పార్టీల కార్యకర్తలు, నేతలు, సానుభూతిపరులు... ప్రత్యర్ధుల ఓట్లను తొలగించేందుకు ఫామ్ 7ను ఆయుధంగా ఎంచుకుంటున్నారు.ఫామ్ 7 దుర్వినియోగంపై ఏపీ ఎన్నికల అధికారులు కొంతకాలంగా కొరడా ఝళిపిస్తున్నా... ఉల్లంఘనలు మాత్రం ఆగడం లేదు. ఈసీ కేసులు నమోదు చేయాలని స్ధానిక పోలీసులకు, కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా వాటిని అమలు చేసేందుకు అధికారులు ఇష్టపడటం లేదు. ఫామ్ 7 దుర్వినియోగం పేరుతో అధికార పార్టీనేతలపై చర్యలకు దిగితే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు తప్పవన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. దీంతో చాలా జిల్లాల్లో ఫామ్ 7 ఉల్లంఘనలను పట్టించుకునేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. ఇదే అదనుగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఏకంగా మీ సేవ కేంద్రాల్లోనే కుప్పలు తెప్పలుగా ఫామ్ 7 దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 50లక్షలకు పైగా తమ సానుభూతిపరుల ఓట్లు తొలగించారంటూ వైసీపీ అధినేత జగన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జిల్లాల్లో సర్వేల పేరుతో ఇంటింటికీ తిరుగుతూ తమ పార్టీకి అనుకూలంగా ఉండే వారి పేర్లు, సమాచారం సేకరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఏపీ ఓటర్ల డేటా చౌర్యం ఆరోపణలు ఇప్పుడు హీట్ పెంచాయి. అయినా ఎలక్షన్ కమిషన్ కానీ, జిల్లాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఉండే కలెక్టర్లు కానీ దీనిపై సీరియస్ గా దృష్టిసారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇదే పరిస్ధితి కొనసాగితే ఎన్నికల తేదీ నాటికి లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతవడం ఖాయంగా కనిపిస్తోంది.
No comments:
Post a Comment