Breaking News

22/03/2019

మూగబోయిన షాద్ నగర్ కాంగ్రెస్ గొంతులు..

కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తల పయనం ఎటు..?
 హైదరాబాద్ మార్చ్ 22 (way2newstv.in)  
1952 షాద్ నగర్ నియోజకవర్గములో కాంగ్రెస్ పార్టీ జైత్ర యాత్ర మొదలై నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి షాద్ నగర్ ఓ కంచుకోటలాగా మారింది. ప్రధాన పార్టీగా చెలామణి అవుతున్న తరుణంలో ఒక్కసారిగా ఆ పార్టీలో రాజకీయ వేడి రగిలింది. ఆనాడు బూర్గుల రామకృష్ణారావు నుండి మొదలు డాక్టర్ పి. శంకర్ రావు వరకు విలువలు గల రాజకీయాలు నాయకులు ఆ పార్టీలో ఉండేవారు.2009 తరువాత నియోజకవర్గము ఎస్సి రిజర్వుడు స్థానం జనరల్ గా మారడంతో చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పట్లో9వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందారు. ఆ తరువాత 2014లో ప్రతాప్ రెడ్డి ఓటమి చెందారు. మళ్ళీ తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి ఘోరంగా అంజయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.ఆ తరువాత ప్రతాప్ రెడ్డి అడపాదడపా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సమీపించిన పార్లమెంట్ ఎన్నికలలో ప్రతాప్ రెడ్డి పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. అనూహ్యంగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి బరిలోకి రావడంతో ప్రతాప్ రెడ్డి పేరు మిన్నకుండిపోయింది. ఇదే సమయంలో నిన్న మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి నామినేషన్ కోసం చౌలపల్లి ప్రతాపరెడ్డి కూడా తోడుగా వెళ్లారు. ఈ సమయంలో ప్రతాప్ రెడ్డి పార్టీ వీడుతారనే అనుమానం ఏ ఒక్కరిలో లేదు. మూగబోయిన షాద్ నగర్ కాంగ్రెస్ గొంతులు..

కానీ మరుసటి రోజే ప్రతాప్ రెడ్డి అనూహ్యంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ , స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరుల వెంట టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ప్రతాప్ రెడ్డి  ఇలా ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం పార్టీ వర్గాలను షాక్ కు గురిచేశాయి. మరోవైపు అటు కార్యకర్తలు గాని ఇటు నాయకులు గానీ కాంగ్రెస్ పార్టీలో ఏం చేయాలో పాలు పోక నిశ్శబ్దం అయ్యారు. మధ్యాహ్నం నుండి కాంగ్రెస్ నాయకులు కొందరు కార్యకర్తలకు ఏం చెప్పాలో అర్థం కాక కొందరు ఫోన్లు కూడా పక్కన పెట్టేశారు. మరికొందరైతే ఏం జరుగుతుందో అంటూ గాలిలోకి చూస్తూ హావభావాలు ప్రదర్శిస్తున్నారు. ఈ మొత్తం రాజకీయ చదరంగంలో ప్రతాప్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరిక రాజకీయంగా దుమారం రేపుతోంది. కాంగ్రెస్ సుదీర్ఘ చరిత్రలో మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదు. 1952 లో ఈ నియోజక వర్గం లో ప్రారంభమైన కాంగ్రెస్ ప్రస్థానం మహానేత బూర్గుల రామకృష్ణారావు నుండి ప్రారంభమైంది. ఆ తరువాత మరెందరో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు. నియోజకవర్గాన్ని అత్యధికంగా పాలించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే కావడం గమనార్హం. అంతేకాదు నియోజకవర్గానికి గతంలో మంత్రి పదవులు కూడా దక్కాయి. కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ పి. శంకర్ రావు ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఆయన అత్యధిక సార్లు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు రాయికల్ దామోదర్ రెడ్డి, భీష్మ కిష్టయ్య,నాగన్న, షాజహాన్, తదితరులు ఎందరో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో ఉన్నారు. వీరిలో  చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కూడా ఉన్నారు. ఒకసారి గెలిచి రెండుసార్లు ఓడిపోయిన ప్రతాప్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బాగానే ఆదరించింది. పార్టీలో తనకంటూ పోసగని నేతలను ప్రతాప్ రెడ్డి చాకచక్యంగా బయటకు పోయేలా చేశారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ ఆ తర్వాత వీర్లపల్లి శంకర్, యుగంధర్,చింటూ  ప్రతాప్ రెడ్డి, జిల్లేలా వెంకట్ రెడ్డి లాంటి కొందరు నాయకులు ప్రతాప్ రెడ్డి నిర్ణయాల వల్ల బయటికి వెళ్లి పోయారు.తాజాగా ప్రతాప్ రెడ్డి నిర్ణయం వల్ల ఆయనే కాంగ్రెస్ పార్టీని స్వయంగా వీడాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ప్రతాప్ రెడ్డి కి పార్టీలో బాగానే చరిష్మా ఉంది. ఆయనకు పార్టీలో ప్రత్యేకమైన నెట్వర్క్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతాప్ రెడ్డి  ఎందుకు పార్టీని వీడాల్సి వచ్చిందని సామాన్య కార్యకర్తలు లబోదిబోమంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎంఎస్ ఎన్ సంస్థలకు సంబంధించిన అధినేత  సోదరుడు మన్నెం శ్రీనివాస్ రెడ్డి కి మహబూబ్ నగర్ పార్లమెంటు సీటును టిఆర్ఎస్ కేటాయించింది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చక్రం తిప్పుతూ అధిష్టానం ఆదేశాల మేరకు షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతాప్ రెడ్డిని పార్టీలోకి ఆకర్షించేలా తెరవెనుక పావులు కదిపారు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో వలసలు ఎక్కువైన నేపథ్యంలో ఇదే ఊపులో ప్రతాప్ రెడ్డి కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ప్రతాప్ రెడ్డిని టిఆర్ఎస్ నేతలు ఆకర్షించారు. ప్రస్తుతం ప్రతాప్ రెడ్డి పార్టీని వీడడం వల్ల ఆయన వెంట నియోజకవర్గంలో ఎవరెవరు వెళతారన్నది సందేహాస్పదంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ విశ్వం, మాజీ మార్కెట్ ఛైర్మెన్ యాదయ్య , పిసిసి సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, ఎం.పి పీ శివ శంకర్ గౌడ్, కట్ట వెంకటేష్ గౌడ్, ఇంకా మండలాల్లో చాలామంది ముఖ్యమైన నాయకులు ఎవరెవరు ప్రతాప్ రెడ్డి వెంట టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారన్నది సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రతాప్ రెడ్డి ఆకస్మిక నిర్ణయం వల్ల ఈ ప్రాంతాల్లో లో కాంగ్రెస్ పార్టీలో నాయకుల గొంతులు మూగబోయాయి. ఎవరికి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియకుండా పోయింది. అందరూ కూర్చొని ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో కొనసాగడమా  లేక ప్రతాపరెడ్డిని అనుసరించడమా అన్న మీమాంస కొనసాగుతోంది. అదేవిధంగా పార్టీలో టిక్కెట్ ఆశిస్తూ చాలాకాలంగా పోటీదారులుగా ఉన్న కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ మాత్రం కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకునేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్న డ్రామా కూడా కొనసాగుతోంది. ఏది ఏమైనప్పటికీ ప్రతాప్ రెడ్డి నిర్ణయం పట్ల పార్టీలో  చర్చకు దారి తీసింది. కార్యకర్తలు మాత్రం కొందరు గుర్రుగా ఉన్నారు. మరికొందరు పెదవి విరుస్తున్నారు. రేపు ఏం జరగబోతుందోనన్న ఆసక్తి నియోజకవర్గంలో అందరిలో ఉంది. ప్రతాప్ రెడ్డి వెంట వెళితే రేపు తమ రాజకీయ భవిష్యత్తుకు గ్యారెంటీ ఎవరు అన్న అనుమానాలు కూడా కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీలో ఉంటున్న సీనియర్ నాయకులను కాదని ఇప్పుడు ప్రతాప్ రెడ్డి వెంట వెళితే తమకు న్యాయం జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి.  

No comments:

Post a Comment