Breaking News

22/03/2019

మినుము కాపాడేనా.? (కరీంనగర్)

కరీంనగర్, మార్చి 22 (way2newstv.in): 
తక్కువ రోజుల్లో పంట చేతికొస్తుందన్న ఆశతో రైతులు మినుముల పంటను సాగు చేసినా ఫలితం లేకుండా పోయింది. జిల్లాలో మినుములు సాగు చేసిన రైతులు ప్రస్తుతం చేతికందిన పంటను తెచ్చి అమ్మకాలకై కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నామని ‘ఈనాడు-ఈటీవీ’తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. మెట్‌పల్లి డివిజన్‌లో సుమారు 4 వేల ఎకరాల్లో మినుములను సాగు చేసినట్లు పేర్కొన్నారు. సుమారు 40 వేల క్వింటాళ్ల దిగుబడి రాగా అమ్మకాలకు నానాతంటాలు పడుతున్నామని వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ పంట సాగు చేస్తున్నా ఒక్క మెట్‌పల్లి డివిజన్‌నే మెట్‌పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లోని పలు గ్రామాలలో అధికంగా పండించారు. మూడు నెలల్లో పంట చేతికి రానునుండటం, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంతో అన్నదాతలు ఈ పంట సాగుకు మొగ్గు చూపారు.


మినుము కాపాడేనా.? (కరీంనగర్)

మినుములకు ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,600 ఉండటంతో రైతుల దృష్టి ఇప్పుడు మినుముల సాగుపై పడింది. దళారులు బయట మార్కెట్లో క్వింటాల్‌కు రూ.4 వేల నుంచి రూ.4,600లకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధరే అధికంగా ఉండటంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నారు. అలా కాని పక్షంలో ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తే రూ.వేలల్లో నష్టపోయే ప్రమాదం ఉంది.
రైతులు పండించిన మినుముల విక్రయానికి కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఇళ్ల వద్దనే నిల్వ ఉంచారు. కొందరు కుప్పలుగా పోసి ఉంచగా మరికొందరు గన్నీ సంచుల్లో నింపారు. 40 రోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిల్వ ఉంచిన మినుములకు పురుగులు పడుతున్నాయని ప్రభుత్వం ఆలోచించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment