Breaking News

23/03/2019

ప్రకాశం వైసీపీలో అస‌మ్మతి సెగ‌లు

ఒంగోలు, మార్చి 23 (way2newstv.in)
ప్రకాశం వైసీపీలో అస‌మ్మతి సెగ‌లు క‌క్కుతోంది. టికెట్ ద‌క్కలేద‌న్న ఆక్రోశం నాయ‌కుల‌దైతే…మా నాయ‌కుడికి ఎంత‌మాత్రం న్యాయం జ‌ర‌గ‌లేదన్నది వారి వారి అనుచ‌రుల కోపం.. ఫ‌లితంగా నిన్నా మొన్నటి వ‌ర‌కు వైసీపీలోకి పెరిగిన వ‌ల‌స‌లు ఇప్పుడు అటు నుంచి టీడీపీలోకి మొద‌ల‌య్యాయి. టికెట్ ద‌క్కని నేత‌లు టీడీపీ కండువా క‌ప్పుకునేందుకు చంద్రబాబు వ‌ద్దకు చేరుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న అస‌మ్మతి ఆ పార్టీ అధిష్ఠానాన్ని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఎప్పుడు ఏ నేత జంప్ అవుతాడోన‌ని టెన్షన్ ప‌డుతూ వ‌స్తోంది రాష్ట్ర అధినాయ‌క‌త్వం. ఇప్పటికే ప‌లువురు పోతున్నట్లు సిగ్నల్ ఇవ్వడంతో వారితో చ‌ర్చలు జ‌రిపినా ఫ‌లితం క‌న‌బ‌డ‌టం లేద‌ని స‌మాచారం.మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జంకె వెంక‌ట‌రెడ్డిని కాద‌ని కేపీ నాగార్జున‌రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించ‌డం విశేషం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న త‌న‌కు టికెట్ ఇవ్వక‌పోవ‌డంపై వెంక‌ట్‌రెడ్డి తీవ్ర మ‌న‌స్తాపం చెందినట్లు స‌మాచారం. పొమ్మన లేక పొగ‌బెట్టార‌ని పేర్కొంటూ ఆయ‌న కార్యక‌ర్తలు, అభిమానుల వ‌ద్ద ఆవేద‌న చెందార‌ట‌. ఇప్పటికే కార్యక‌ర్తల‌తో ప్రత్యేకంగా స‌మావేశ‌మైన ఆయ‌న ఈరోజో రేపో టీడీపీలో చేరేందుకు అన్ని సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. 


 ప్రకాశం వైసీపీలో అస‌మ్మతి సెగ‌లు 

ఇక ప‌రుచూరు టికెట్ను ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర్లుకు కేటాయించ‌డంతో నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌యక‌ర్త‌గా ప‌నిచేస్తున్న రావి రామానాథం బాబు ప‌రిస్థితి ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. పార్టీ అన్ని ర‌కాలుగా త‌న‌ను వాడుకుని తీరా ఇప్పుడు ద‌గ్గుపాటికి టికెట్ కేటాయించ‌డంపై ఆయ‌న దుమ్మెత్తిపోస్తున్నారు. సోమ‌వారం ఆయ‌న చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది.ఇక కొండపి టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ ప‌రికూటి అశోక్‌బాబు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమ‌వుతున్నారు. ఆయ‌న సోద‌రుడు అమృత‌పాణి గ‌త ఎన్నిక‌ల్లో బాప‌ట్ల ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో అన్నను కొండపి నుంచి బ‌రిలో దించాల‌ని భావించారు. అయితే వైసీపీ ఝ‌ల‌క్ ఇవ్వడంతో వారిద్ద‌రు పార్టీలోంచి బ‌య‌ట‌కి వ‌చ్చేందుకు సిద్ధమ‌య్యారు. చీరాల రెబ‌ల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అశోక్‌బాబు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ట‌. అదే జ‌రిగితే ఇక్కడ వైసీపీ ఓట్లు చీల‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.గిద్దలూరు టికెట్ ఆశించి సాధించుకోలేక‌పోయిన ఐవీరెడ్డి కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు సిద్ధమ‌వుతున్నారు. ఇక్కడ వైసీపీ టికెట్‌ను అన్నే రాంబాబుకు ద‌క్కించుకున్నారు. ఇక ఒంగోలు ఎంపీ స్థానం నుంచి టికెట్ ఆశించిన వైవీ సుబ్బారెడ్డిని ప‌క్కన‌పెట్టి అధిష్ఠానం మాగుంట శ్రీనివాసులురెడ్డికి కేటాయించ‌డంపై ఆయ‌న అభిమానులు తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నార‌ట‌. త్వర‌లో టీడీపీ తీర్థం పచ్చుకునేందుకు వారు రెడీ అవుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇలా ప్రకాశం జిల్లాలో ప‌రిప‌రివిధాలుగా వైసీపీ అస‌మ్మతి గుండంలో చిక్కుకుని కాలిపోతోంది. ఈ మంట‌లను జగన్ ఆర్పగలుగుతారో? లేదో? చూడాలి.

No comments:

Post a Comment