విశాఖపట్టణం, మార్చి 9, (way2newstv.in)
కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ పనిచేసిన ‘ప్యూజన్ ఫుడ్ అండ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ కాంట్రాక్టును రద్దు చేస్తూ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జారీచేసిన ఆదేశాలను హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏఏఐ ఆదేశాలను సవాల్ చేస్తూ ఫ్యూజన్ ఫుడ్ ఎండీ టి.హర్షవర్దన్ ప్రసాద్ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్ దీనిని విచారించారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది లలిత వాదనలు వినిపిస్తూ.. ‘విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి చేసిన శ్రీనివాస్ ఫ్యూజన్ ఫుడ్ హోటల్ ఉద్యోగిగా ఉన్నాడు. ఈ దాడికి, పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయినా నిబంధనల ఉల్లంఘన, దుష్ప్రవర్తన తదితర కారణాలు ప్రస్తావిస్తూ హోటల్ కాంట్రాక్టును రద్దు చేస్తూ గత నెల 18వ తేదీన ఏఏఐ ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేసింది.దాడి జరిగిన రోజు ఉదయం 11.30 గంటలకే డ్యూటీ ముగియడంతో నిందితుడు శ్రీనివాస్ వెళ్లిపోయాడు. అలాంటప్పుడు ఆ దాడితో పిటిషనర్‌కేం సంబంధం? నిందితుడు దాడికి ఉపయోగించిన వస్తువు కూడా హోటల్‌కు సంబంధించినది కాదు. ఒప్పందం మేరకు 180 రోజులు ముందుగా నోటీసులు ఇవ్వాల్సివుండగా ఏఏఐ వాటిని పట్టించుకోలేదు.
ఎయిర్ పోర్టు ఆధారిటీకి హైకోర్టు మొట్టికాయలు
పిటిషనర్ సంస్థ సిబ్బందిని రకరకాలుగా వేధిస్తున్నారు. వారిని విమానాశ్రయంలోకి అనుమతించడం లేదు. హోటల్లో 24 మంది పని చేస్తున్నారు. వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి’ అని అభ్యర్థించారు. ప్రతివాది తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఫ్యూజన్ ఫుడ్ హోటల్ ఒప్పందంలోని నిబంధనలను అతిక్రమించింది. ఇది శాంతిభద్రతలకు సంబంధించిన వ్యవహారం. ఒప్పందం మేరకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉన్నందున పిటిషనర్ ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్లాలి. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదు’ అని తెలిపారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘నిందితుని గత నేరచరిత్ర యజమానికి ఎలా తెలుస్తుంది? బస్టాండులో ఉద్యోగి ప్రయాణికులపై రాయి వేస్తే సదరు రవాణా సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు. రెండు పక్షాల వాదనలు విన్న అనంతరం ఫ్యూజన్ సంస్థ కాంట్రాక్టును రద్దు చేస్తూ ఏఏఐ జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హోటల్ సిబ్బందిని సహజ షరతులతో విమానాశ్రయంలోకి అనుమతించాలని కూడా సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో తగిన వివరణ ఇవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ ముఖ్య కార్యదర్శిని, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌ను, ఏఏఐ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ని, విశాఖ విమానాశ్రయ డైరెక్టర్‌ని, పౌరవిమానయాన భద్రతా విభాగ రీజనల్ డైరెక్టర్‌ని, ఏపీ డీజీపీని, విశాఖ పోలీసు కమిషర్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.
No comments:
Post a Comment