Breaking News

20/03/2019

విత్తన కంపెనీల మోసం..

సగానికి పడిపోయిన దిగుబడి
ఖమ్మం,మార్చి 20, (way2newstv.in)
విత్తన కంపెనీ మాయ తో 45 క్వింటాళ్లు రావాల్సిన వరి దిగుబడి, 12 నుంచి 14 క్వింటాళ్లకు పడిపోయింది. స్వల్పకాలంలోనే పంట చేతికి వస్తుందని, అధిక దిగుబడి పొందుతారని ప్రైవేట్ కంపెనీల మాటలు నమ్మి సాగు చేస్తే నిండా మునిగే పరిస్థితి ఏర్పడింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆదిత్య అగ్రిటెక్ ప్రైవేట్ విత్తన కంపెనీ అభిరుచి వెరైటీని రైతులకు విక్రయించింది. 130 రోజుల నుంచి 140 రోజుల్లో కోతకు రావాల్సిన పంట తొందరగా పొట్టకు వచ్చింది. అందులోనూ సాధారణ ఎత్తు కంటే తక్కువ ఎత్తులో ఏకంగా 60 సెంటీమీటర్ల నుంచి 70 సెంటిమీటర్లకు తగ్గి ఎదిగింది. 20 రోజుల్లోనే వెన్నులు వచ్చాయి. అలా 60 రోజుల్లో మూడు దశల్లో వెన్ను వచ్చింది. రెండో దశ కంకులు వచ్చే సమయానికి మొదటి దశ గింజలు ఎండిపోయి పొలంలోనే రాలిపోయాయి. అలాగే మూడో దశ కంకులు వచ్చే సరికి రెండో దశ కంకులు వాడు దశకు చేరుకున్నాయి.ఆందోళన చెందిన రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేస్తే అసలు విషయం వెలుగు చూసింది. 


విత్తన కంపెనీల మోసం..

జయశంకర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు నల్లగొండలోని యాదగిరి పల్లి, ఉట్లపల్లి, సూర్యాపేటలోని హుజుర్‌నగర్, పాలకీడు, గరీడుపల్లి, నేరేడుచెర్ల, మేళ్లచెరువు మండలాల్లో వరి పంటలను పరీశించారు. ఫోటో, థర్మో సెన్సివిటి  ఎక్కువగా ఉండటం కారణంగానే వరి తొందరగా ఎదిగి వెన్నులు వచ్చిందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎకరాకు 45 క్వింటాళ్ల నుంచి 50 క్వింటాళ్ల మధ్య రావాల్సిన దిగుబడి 14 క్వింటాళ్ల వరకే వస్తుందని అంచనా వేశారు. అయితే కోత కోసిన తరువాతే పూర్తి స్థాయిలో నిర్ధారించవచ్చునని పేర్కొన్నారు. దాదాపు 4 వేల ఎకరాల్లో 1.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి పడిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఈ విత్తనాలు విక్రయించిన కొందరు డీలర్ల లైసెన్సులను రద్దు చేశారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ కంపెనీకి నోటీసులు జారీ చేసినప్పటికీ, విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం లేదు. దీంతో అభిరుచి విత్తనం జెనిటిక్ ప్యూరిటిని పరీక్షించేందుకు డిఎన్‌ఎ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు చెప్పారు. అందులో 98 శాతం వరకు ఉండాల్సిన జెనెటిక్ ప్యూరిటి తగ్గినట్లు తెలిసింది. పరీక్ష ఫలితాల్లో తేడాలు వస్తున్నందున మరోమారు పకడ్బందీగా ప్యూరిటిని పరీక్షిస్తున్నట్లు తెలిసింది. అదిత్య అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అభిరుచి వెరైటీని వెయ్యి మంది రైతులకు విక్రయించినట్లు తెలిసింది.ఫోటో సెన్సివిటి  అంటే పగలు ఉండే సమయం, రాత్రి ఉండే సమయాల్లో మార్పు కారణంగా పంట ఎత్తు పెరగకపోవడం, దానిపై ప్రభావం చూపడాన్ని ఫోటో సెన్సివిటిగా జయశంకర్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉష్ణోగ్రతను బట్టి పంటపై ప్రభావం పడితే థర్మో సెన్సివిటి ఉంటుంది. సాధారణంగా రబీలో థర్మో సెన్సివిటి ఉంటందని శాస్త్ర వేత్తలు చెప్పారు

No comments:

Post a Comment