Breaking News

22/03/2019

ఎన్నికల్లో ప్రచారం పై నిఘా

మెదక్, మార్చి 22, (way2newstv.in)
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. షాడో బృందాలు ప్రధానంగా ప్రచార ఖర్చులపై నిఘా పెడతాయి. వివిధ పార్టీల ర్యాలీలు, సభల నిర్వహణను షాడో బృందాలు చిత్రీకరిస్తాయి. వాహనాల సంఖ్య, బ్యానర్లు, ఫ్లెక్సీలతోపాటు ప్రచార సామగ్రి వంటి వివరాలు, ఫొటోలను వెంటవెంటనే ఉన్నతాధికారులకు అందజేస్తాయి. అభ్యర్థులకు తెలియకుండానే.. ఈ బృందాలు పని కానిచ్చేస్తాయి. అంతేకాకుండా.. సమస్యాత్మకమైన అభ్యర్థులు, వారి అనుచరుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వీడియో రికార్డ్‌ చేస్తాయి. ఆయా వ్యక్తులు ఎప్పుడు.. ఎక్కడకు వెళ్తున్నది.. ఎవరితో మాట్లాడుతున్నది వంటి వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తాయి. అసెంబ్లీ, పంచా యతీ ఎన్నికలను ఎలాగైతే విజయవంతంగా పూర్తి చేశారో... అదే తరహాలో లోక్‌సభ పోరును నిర్వహించేందుకు అధికారు లు సన్నద్ధమయ్యారు.ఈసీ నిబంధనల ప్రకారం ఎంపీ అభ్యర్థి రూ.78 లక్షలకు మించి ఖర్చు చేయొద్దు. దీనికి విరుద్ధంగా అదనపు ఖర్చులు చేసినట్లు రుజువైతే.. గెలుపొందినా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. 


ఎన్నికల్లో  ప్రచారం పై నిఘా

అదేవిధంగా.. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిబంధనలకు మించి ఖర్చు పెట్టినట్లు తేలితే వారు ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ‘షాడో’ బృందాల తో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టేందుకు షాడో పోలీసు లు కృషి చేస్తారు. షాడో పార్టీలుగా నిలిచే పోలీసులు నిత్యం అభ్యర్థుల వెన్నం టే ఉంటారు. ప్రచారానికి సంబంధించి ఖర్చును తక్కువగా చూపినా.. షాడో బృందాలు ఇచ్చే సమాచారం ఆధారంగా ఎన్నికల అధికారులు లెక్కలు కట్టనున్నారు.మెదక్‌ లోక్‌ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రత్యేక షాడో బృందాలను కేటాయించారు. ఈ పార్లమెంట్‌ స్థానంలో మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు ఎస్‌ఎస్‌టీ (షాడో స్పెషల్‌ టీం) బృందాలు, మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల చొప్పున నియమించనున్నారు. ఒక్కో ఎస్‌ఎస్‌టీ బృందంలో సహాయ వ్యయ పరిశీలకుడు, ఆదాయపు పన్ను శాఖ అధికారి, పోలీస్‌ అధికారితోపాటు రెవెన్యూ అధికారి ఉండనున్నారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా.. బెదిరింపులకు పాల్పడకుండా ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. బ్యాంక్‌ లావాదేవీలపైనా ఎన్నికల అధికారులు నజర్‌ వేశారు. ప్రధానంగా ఆన్‌లైన్‌ ద్వారా జరిగే లావాదీలపై కన్నేశారు. ఈ మేరకు మెదక్‌ లోక్‌సభ పరిధిలోని సంబంధిత అధికారులు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌తో సమావేశం నిర్వహించి తగిన సూచనలు చేశారు. ఏకకాలంలో ఎక్కువ మందికి ఒకే ఖాతా నుంచి లావాదేవీలు జరిగినా.. ఒకే రోజు ఎక్కువ మొత్తంలో నగదు విత్‌డ్రా చేసుకున్నా.. జిల్లా ఎన్నికల అధికారి, ఆదాయపు పన్ను, పోలీస్‌ అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. అనుమానాస్పద లావాదేవీలపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని.. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ప్రతి రోజూ లావాదేవీల వివరాలు అందజేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏటీఎంలలో నగదు పెట్టేందుకు తీసుకెళ్లే వాహనాలపై కూడా నిఘా పెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రచార ఖర్చుల వివరాలను రాసేందుకు అభ్యర్థులకు ఈసీ రూపొందించిన ప్రత్యేక నోట్‌బుక్‌ను అందజేయనున్నారు. ఇందులో రోజువారీ ఖర్చు.. బ్యాంక్‌ లావాదేవీలతోపాటు పలు వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.  

No comments:

Post a Comment