Breaking News

23/03/2019

వసంతోత్సవంతో ప్రారంభమైన పెళ్లి పనులు

ఖమ్మం మార్చి 23  (way2newstv.in)
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకల పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం హోలీ సందర్భంగా నిర్వహించే డోలోత్సవం, వసంతోత్సవానికి బుధవారం అంకురార్పణ చేశారు. ముందుగా పవిత్ర గోదావరి నది నుంచి మేళతాళాల నడుమ రామాలయానికి తీర్థపు బిందెను తీసుకొచ్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 6 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 14న రామయ్యకు కల్యాణం జరిపిస్తారు. కాగా, హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని స్వామికి నేడు సహస్ర ధారతో ప్రత్యేక స్నపన కార్యక్రమం ఉంటుంది. అది రామచంద్రుడు పుట్టిన రోజు. ఆగమ శాస్త్రం ప్రకారం సీతారాములకు ఆ రోజు జగత్కల్యాణం చేస్తారు. పెళ్లి పనులను ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఆరంభించడంతో  భద్రాద్రి భక్తులతో కిటకిటలాడింది. భజనలు, కీర్తనలతో పరిసరాలు ఆధ్యాత్మికతతో అలరారాయి. సమస్త మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా వేద ఘోష వీనులకు విందు చేస్తుండగా నిర్వహించిన క్రతువు కమనీయమై మురిపించింది. 


వసంతోత్సవంతో ప్రారంభమైన పెళ్లి పనులు

ఉదయం పసుపు కొమ్ములను దంచడంతో మొదలైన క్రతువులోని ప్రతీ ఘట్టం పరమానందాన్ని పంచింది. ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. అంతా రామమయమై కల్యాణ సౌరభాలను వెదజల్లింది.త్రేతాయుగంలో ఇటు అయోధ్య నగరాన్ని అటు జనక రాజ్యాన్ని శోభితం చేసిన పుణ్య ఘడియలు కావడంతో ఫాల్గుణ పౌర్ణమి వేళ భక్తిభావాలు వెల్లువెత్తాయి. వైష్ణవ సంప్రదాయం మేరకు చిత్రకూట మండపంలో స్థానాచార్యులు స్థలసాయి నేతృత్వంలో రోలు రోకలిని పూజించారు. అర్చకుల కుటుంబాలకు చెందిన మహిళలు రోలులో పసుపు కొమ్ములు వేసి రోకటితో దంచారు. ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు, ఏఈవో శ్రావణ్‌కుమార్‌ ఈ పెళ్లి పనుల్లో పాల్గొన్నారు. ఫాల్గుణ పౌర్ణమి శుభకరమని భక్తులు ఈ వేడుకలో పాల్గొనేందుకు విశేష సంఖ్యలో తరలివచ్చారు. సెలవు దినం కావడంతో ఎటు చూసినా కల్యాణ ముచ్చట్లే. తొక్కిసలాట జరుగుతుందన్న ఉద్దేశంతో ఈసారి కొద్దికొద్దిగా భక్తులను చిత్రకూట మండపంలోకి రానిచ్చారు. ఒకేసారి ఎక్కువ మంది లోపలకు రాకుండా ఉండేందుకు చిత్రకూటానికి తలుపు వేసి అక్కడ పోలీసులతో పాటు ఎస్పీఎఫ్‌ సిబ్బందిని భద్రతగా ఉంచారు. ఈ పరిస్థితుల్లో తమ వంతు ఎప్పుడొస్తుందో తెలియక భక్తులు చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. పడిగాపులు కాసినప్పటికీ పెళ్లి పనుల్లో తలా ఒక చేయి వేసే అవకాశం రావడంతో ఉప్పొంగిపోయారు. నిత్య కల్యాణంలో పసుపు రంగులో తలంబ్రాలు ఉంటాయి. ఇవి మాత్రం ఎరుపు రంగులో ఉండటం విశేషం. సుగంధ ద్రవ్యాలను బియ్యంలో కలిపి తలంబ్రాలను తయారు చేసేందుకు భక్తులు అమితాసక్తి కనబర్చారు. తొలి విడత తలంబ్రాలు సిద్ధం కావడంతో చిత్రకూటం సువాసనలతో నిండిపోయింది. ఈ ప్రాంతాన్ని భూలోక స్వర్గంగా భక్తులు భావించి తన్మయులయ్యారు.కొండంత దేవ దేవుడి కల్యాణానికి ఉడతాభక్తిని చాటిన భక్తులకు స్వామివారికి నిత్య కల్యాణ మండపం వద్ద చేసిన స్నపన తిరుమంజనం వీక్షించే భాగ్యం దక్కింది. అభిషేక మహోత్సవం వైభవంగా కనిపించింది. కలశాల నుంచి పుణ్య జలాలను పోసే సమయంలో పెద్దపెట్టున జైశ్రీరాం అంటూ నీరాజనాలు పలికారు. ఊయలలో ఉన్న స్వామికి డోలోత్సవం చేశారు. హరిదాసుల కీర్తనలు మంత్రముగ్ధం చేయగా యాగశాలలో ప్రత్యేక పూజలు కొనసాగాయి. వసంతోత్సవంతో చల్లని రామయ్య పెళ్లి కొడుకులా సీతమ్మ పెళ్లి కుమార్తెలా కనిపించారంటూ మురిసిపోయారు. 

No comments:

Post a Comment