Breaking News

06/03/2019

మేనిఫెస్టోపై వైసీపీ కసరత్తు

హైద్రాబాద్, మార్చి 6  (way2newstv.in)
వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందు ఉంచబోయే మేనిఫెస్టోపై  వైసీపీ కసరత్తు ప్రారంభించింది. పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై దృష్టి పెట్టింది. ఈ కమిటీ అధినేత జగన్ ను కలిసి ప్రజలకు ఇవ్వబోయే వాగ్దానాలపై చర్చించారు. ఈ సమావేశంలో జగన్ మేనిఫెస్టో కమిటీకి పలు సూచనలు అందించారు. పొందుపరచాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేశారు. మేనిఫెస్టోలో చేసే వాగ్దానాలన్నీ నిజాయితీగా చేస్తామని జగన్ అన్నారు. వాగ్దానాల విషయంలో తమకు ఏ పార్టీతో పోటీలేదని.. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను పొందుపరుస్తామన్నారు. 


 మేనిఫెస్టోపై వైసీపీ కసరత్తు 

మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. అలాగే సంక్షిప్తంగా అందరికీ అర్థమయ్యేలా మేనిఫెస్టో రూపకల్పన చేయాలని అభిప్రాయపడ్డారు. అలాగే కౌలు రైతులకు న్యాయం చేసేలా పథకాలు ఉండాలని.. వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రెండు సమావేశాల్లో చర్చించిన అంశాలు, సిఫార్సులపై సమావేశంలో చర్చించామన్నారు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి. సులువుగా పాయింట్స్ వారీగా మేనిఫెస్టో ఉంటుందని.. మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యేలా చూడాలన్నారు. నవరత్నాల్లోని 9 అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలని.. ప్రజల నుంచి వచ్చిన సూచనలకు మెరుగులు దిద్దాలన్నారు. అలాగే పాదయాత్రలో చేసిన వాగ్దానాలను మేనిఫెస్టోలో చేర్చి.. మనం చేసిన వాగ్దానాలు, వాటి ఆర్థిక భారాన్ని కూడా లెక్కెయ్యాలన్నారు. ఈ నెల 12న మేనిఫెస్టో కమిటీ మరోసారి సమావేశమవుతుందని తెలిపారు

No comments:

Post a Comment