Breaking News

14/03/2019

ఒత్తిళ్లకు బాబు లొంగుతున్నారే

విశాఖపట్టణం, మార్చి 14, (way2newstv.in)
తెలుగు దేశం పార్టీ చెప్పిన దానికి భిన్నంగా విశాఖ జిల్లాలో సిట్టింగులకే మరో మారు పట్టం కట్టింది. విశాఖలో ఉన్న మెజారిటీ సీట్లు ఇపుడున్న ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు ఇస్తూ కట్టబెట్టింది. ఈ పరిణామంతో ఆశావహులు రగిలిపోతూండగా ఎమ్మెల్యేలు మాత్రం హుషార్ గా ఉన్నారు. అయితే వారిని గెలిపించాల్సిన నాయకులు, క్యాడర్లో రేగిన అసంతృప్తి ఎటు దారితీస్తుందోనని అంతటా చర్చగా ఉంది. విశాఖ జిల్లాలో టీడీపీ చేసిన అంతర్గత సర్వేల ప్రకారం చూసుకున్నా సగానికి సగం మంది ఎమ్మెల్యేలపై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాగే వారి పనితీరు పట్ల పార్టీలో కూడా అసంలృప్తి ఉంది. అప్పట్లో వారికి తక్కువ ర్యాంకులు ఇచ్చిన చంద్రబాబే ఇపుడు మెచ్చుకుని మరీ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం చూస్తూంటే వారి గెలుపుపై ఒక్కసారిగా అధినాయకత్వానికి ఎందుకంత నమ్మకం పెరిగిపోయిందన్నదే ఇక్కడ ప్రశ్న.నిజానికి టీడీపీలో ఎంతోమంది సమర్ధులు ఉన్నారు. ప్రతీ నియోజకవర్గంలో నలుగురైదుగురు టికెట్ కావాలని పోటీ పడుతున్నారు. అయినా కూడా వారిని పక్కన పెట్టడం వెనక కారణలేంటన్న దాని మీద ఆశావహులు మల్లగుల్లాలు పడుతున్నారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీద వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఆయనకు టికెట్ ఇవ్వవద్దంటూ తమ్ముళ్ళు భారీ ర్యాలీయే తీసారు. మీడియా సమావేశం పెట్టి మరీ మైనారిటీ నాయకులు ఎమ్మెల్యే తీరుని కడిగిపారేశారు. 


ఒత్తిళ్లకు బాబు లొంగుతున్నారే

ఆయనకు మరో మారు టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని కూడా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా టికెట్ మళ్ళీ ఆయనకే దక్కింది. ఇక మరో సీటు గాజువాక. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అవినీతి బంధుప్రీతి మీద ఓ స్థాయిలో సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెతాయి. ఆయనకు పోటీగా పార్టీలోనే ఇతర నాయకులు రంగంలోకి దిగిపోయారు. దాంతో ఆయనకు టికెట్ రాదనుకున్నారంతా. చిత్రంగా ఆయనకే మళ్ళీ టికెట్ ఇచ్చేశారు.ఇక పెందుర్తి, అనకాపల్లి ఎమ్మెల్యేల గురించి చెప్పుకోవాలి. పెందుర్తిలో సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. ఆయన కుమారుడు అప్పలనాయుడు అక్కడ డిఫ్యాక్టో ఎమ్మెల్యేగా భూ దందాలు చేయడాన్ని టీడీపీలోనే వ్యతిరేకిస్తున్నారు. అలాగే ముదపాక‌ భూముల దందాపై ఆరోపణలు, దళిత మహిళను వివర్స్త్రను చేయడంపైన పెద్ద ఎత్తున చెలరేగిన దుమారం వంటివి పరిగణనలోకి తీసుకున్నపుడు టికెట్ ఇవ్వరనే టీడీపీలో అంతా భావించారు. కానీ బండారే మాకు ముద్దు అంటూ అధినాయకత్వం ఓటేసింది. అలాగే అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ భూ దందాల మీద ఏకంగా సిట్ కేసులు నమోదు చేసింది.ఇక ఆయన పనితీరు కూడా అసలు బాగులేదని పార్టీలోనే పెదవి విరిచేశారు. అయినా కోరి మరీ పీలాకే అక్కడ పట్టం కడుతున్నారు. ఇదే తీరున చోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు మీద అక్కడ బలమైన సామాజిక వర్గం గుస్సా అవుతోంది. తమకు టికెట్ ఈసారి ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ కూడా చేస్తూ వచ్చింది. అయితే చిత్రంగా రాజుకే బాబు టికెట్ ఇచ్చారు. పాడేరులో ఫిరాయింపు కుటుంబాలకే అరకు, పాడేరులలో టికెట్లు ఇచ్చి సొంత పార్టీ నేతలకు మొండి చేయి చూపించారు. మరి ఈ పరిణామాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాల్సిఉంది.

No comments:

Post a Comment