Breaking News

28/03/2019

పోలవరంపై మరో పేచి

ఏలూరు, మార్చి 28  (way2newstv.in)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపి తీరాల్సిందేనని తెలంగాణ సర్కారు మళ్లీ మళ్లీ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేస్తూనే ఉంది. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన అంశంపై తమ అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదిస్తోంది. తాజాగా మళ్లీ పర్యావరణ ప్రభావ మదింపు, బ్యాక్‌వాటర్‌ ప్రభావ మదింపు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతోంది. గరిష్ఠంగా 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకొని 2005లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చిందని, ఆ తర్వాత కాలంలో డిజైన్లు మార్చిన నేపథ్యంలో గరిష్ఠ వరద ప్రవాహం 50 లక్షల క్యూసెక్కులకు చేరిందని వివరించింది.విభజన చట్టంలోని హామీలు, అంశాలు, నిబంధనలను అమలు చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి సిద్ధమవుతోంది. 


పోలవరంపై మరో పేచి

ఈ కేసులో కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ప్రతివాదులుగా ఉన్నాయి. కాగా, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేయనున్న కౌంటర్‌ అఫిడవిట్‌లో ఒక్కో అంశం అమలు స్థితి గురించి పేర్కొంది. నిర్ణీత గడువులోగా చట్టంలో ఉన్నవన్నీ పూర్తి చేయాలని కోరింది. 2017-18తో పాటు ఈ ఏడాదిలోనూ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 100 టీఎంసీల నీటిని మళ్లించిందని, తద్వారా గోదావరి జలాల్లో తమ వాటా పెరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చిన నేపథ్యంలో గోదావరి నదీ జలాల వివాదాల ట్రైబ్యునల్‌ తీర్పు మేరకు ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ద్వారా 45 టీఎంసీల నీటిని వినియోగించుకునే హక్కు ఉందని పునరుద్ఘాటించింది. అలాగే రాజోలిబండ మళ్లింపు పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయని, 4.56 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామని, దాంతో ప్రాజెక్టును ఆధునికీకరించాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసిందని, కానీ ఏపీ ప్రభుత్వం పనులు చేపట్టకుండా వివాదాలను సృష్టిస్తోందని ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వంటి ముఖ్యమైన డైవర్షన్‌ పాయింట్‌ దగ్గర టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయని కారణంగా కృష్ణా బేసిన్‌కు అధికంగా నీటిని తరలిస్తున్నారని పేర్కొంది.

No comments:

Post a Comment