Breaking News

04/03/2019

కూతురు కోసం పదవి వద్దన్నారట...

హైద్రాబాద్, మార్చి 4, (way2newstv.in)
కొద్ది రోజుల క్రితం కేబినెట్ విస్తరణ చేపట్టిన కేసీఆర్... ఎక్కువగా కొత్త ముఖాలకే మంత్రివర్గంలో చోటు కల్పించారు. అయితే కేబినెట్ విస్తరణలో చోటు ఖాయమని అంతా అనుకున్న సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు మాత్రం మంత్రివర్గంలో బెర్త్ దక్కలేదు. గిరిజన సామాజికవర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఉన్నా... కేసీఆర్ మాత్రం ఆ వర్గం నుంచి మంత్రివర్గంలోకి ఎవరినీ తీసుకోకపోవడంపై చర్చ జరిగింది. అయితే రెడ్యానాయక్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావించిన కేసీఆర్... షరతులు వర్తిస్తాయి అని చెప్పడం వల్లే ఆయనకు అమాత్యయోగం దక్కలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేబినెట్‌లోకి తీసుకోవాలన్న రెడ్యానాయక్ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గులాబీ బాస్... మీకు మంత్రి పదవి ఇస్తే... కుమార్తె కవితకు మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉండదని క్లారిటీ ఇచ్చారని సమాచారం. 


కూతురు కోసం పదవి వద్దన్నారట...

దీంతో తాను మంత్రి కావాలా లేక తన కుమార్తెకు ఎంపీ సీటు ఇప్పించాలా అనే విషయంలో రెడ్యానాయక్ ఎటూ తేల్చుకోలేకపోయారని టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే తనకు ఎంపీ సీటు ఇప్పించాలని కుమార్తె మాలోతు కవిత ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆయన కేబినెట్‌లో చేరే అంశంపై డైలమాలో పడిపోయారని తెలుస్తోంది. తెలంగాణ వచ్చిన తరువాత కేబినెట్‌లో మంత్రిగా ఉండాలని భావిస్తున్న రెడ్యానాయక్... కేవలం కుమార్తె ఒత్తిడి వల్లే కేబినెట్‌కు దూరంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మాలోతు కవితకు మహబూబాబాద్ ఎంపీ టికెట్ వస్తుందా రాదా అన్న దానిపైనే మలివిడత విస్తరణలో రెడ్యానాయక్‌కు చోటు ఉంటుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుందని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి... రెడ్యానాయక్ మంత్రి అవుతారా లేక కుమార్తె కోసం అమాత్య పదవిని వదులుకుంటారా అన్నది చూడాలి.

No comments:

Post a Comment