Breaking News

29/03/2019

ఈసీ విధుల్లో జోక్యం చేసుకోము..సర్కార్ కు హైకోర్టు షాక్

విజయవాడ, మార్చి 29, (way2newstv.in)
ఇంటెలిజెన్స్ డీజీ, కడప, శ్రీకాకుళం ఎస్పీలను అకస్మాత్తుగా ఎన్నికల కమిషన్ బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. ఐపీఎఎస్‌ల బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ బదిలీలు ఎలాంటి శిక్ష కాదనీ, ఓసారి పోలింగ్ పూర్తయ్యాక వీరంతా తిరిగి తమ విధుల్లో చేరవచ్చని ఈసీ తరఫున న్యాయవాదులుతేల్చిచెప్పారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని చెబుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీల బదిలీలపై గురువారం సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను సమర్థిస్తూ సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపించగా, ఎన్నికల విధులతో సంబంధం లేని ఇంటెలిజెన్స్‌ డీజీని బదిలీ చేసే అధికారం ఈసీఐకి లేదని ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదించారు. 


ఈసీ విధుల్లో జోక్యం చేసుకోము..సర్కార్ కు హైకోర్టు షాక్

ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. ఎన్నికల విధులు అప్పగించిన పోలీసు అధికారుల జాబితాను న్యాయస్థానానికి అందజేసిన అడ్వొకేట్ జనరల్ ఇందులో ఇంటెలిజెన్స్‌ డీజీ లేరని తెలిపారు. ఈసీఐ ఉత్తర్వుల్లో బదిలీ కారణాలను తెలుపలేదని, బదిలీ అయినవారి స్థానంలో నియమించేందుకు మూడు ప్యానల్‌ పేర్లను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం రాష్ట్ర అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని తెలిపారు. ఎస్పీల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఈసీఐకి ఉండొచ్చు కానీ, డీజీ వ్యవహారంలో జోక్యానికి వీల్లేదని అన్నారు. ఎన్నికల విధులతో సంబంధం లేని అధికారులపై ఈసీఐ జోక్యం తగదని 1978లో సుప్రీంకోర్టు తీర్పును ఉదాహరణగా చూపారు. అయితే వీటిని తోసిపుచ్చిన ధర్మాసనంపై జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.
డీజీని బదిలీ చేసిన ప్రభుత్వం
రాష్ట్ర ఎన్నికల సమరాంగణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నిఘా విభాగం డీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు సీఎస్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీచేశారు. వెంకటేశ్వరరావును పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలంటూ సూచించారు. కొన్నిరోజుల క్రితం డీజీ వెంకటేశ్వరరావుతో పాటు కడప, శ్రీకాకుళం జిల్లాల పోలీసు బాస్ లను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. కారణాలు చెప్పకుండా నిజాయతీపరులైన అధికారులను బదిలీ చేస్తున్నారంటూ టీడీపీ అధినాయకత్వం మండిపడింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ సర్కారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ ను కొట్టివేసింది. ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో, డీజీ వెంకటేశ్వరావును కూడా బదిలీ చేసినట్టు అర్థమవుతోంది.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు
కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు సరైనవే అని ఏపీ హైకోర్టు ఎక్కడా చెప్పలేదని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ తప్పు అని కూడా న్యాయస్థానం ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోమని మాత్రమే కోర్టు చెప్పిందన్నారు. న్యాయస్థానం ఈరోజు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబుతో చర్చించి అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా పోతామని వ్యాఖ్యానించారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి  గోపాలకృష్ణ ద్వివేది చాలా అసమంజసంగా మాట్లాడారని రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. అధికారులను బదిలీ చేయడం శిక్ష కాదనీ, ఎలాంటి విచారణ చేపట్టకుండా ఈసీ చర్యలు తీసుకోవచ్చని ద్వివేది చెప్పారన్నారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడారు.ఈ విషయంలో ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఈ మాటలతో తేలిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వైఖరిని తాము సహించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే మోదీ సీబీఐ, ఈడీ, ఐటీ, న్యాయవ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. అదే తరహాలో ఈరోజు ఎన్నికల సంఘాన్ని మోదీ ప్రభావితం చేస్తున్నారన్న అనుమానం తమకు వస్తోందని  తెలిపారు. ఈసీ కొత్తగా నిర్వచనాలు ఇస్తూ అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment