Breaking News

13/03/2019

యూపీపై హస్తం పార్టీ దృష్టి

లక్నో, మార్చి 13, (way2newstv.in)
ఉత్తరప్రదేశ్… దేశ రాజకీయాలకు దిక్సూచీ వంటిది. 80 లోక్ సభ స్థానాలు, దాదాపు 20 కోట్ల జనాభా గల ఈ రాష్ట్రం దేశంలోనే అతిపెద్దది. ఇక్కడ పట్టు సాధిస్తే ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవడం తేలిక అన్నది పార్టీల భావన. అందుకే అన్ని పార్టీలు యూపీపై దృష్టి పెడుతుంటాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు తమ పాత వైరాన్ని పక్కన పెట్టి అందరికన్నా ముందుగానే పొత్తులు కుదుర్చుకున్నాయి. గత ఎన్నికల్లో 71 స్థానాలను గెలుచుకున్న అధికార భారతీయ జనతా పార్టీ ఎప్పటిలాగానే ఒంటరిగా ముందుకు సాగనుంది. ఇక మిగిలింది హస్తం పార్టీ. ఒకప్పుడు రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన ఈ పార్టీ ఇప్పుడు దైన్య స్థితిలో ఉంది. మాయావతి, అఖిలేష్ యాదవ్ ల కూటమి హస్తం పార్టీకి రెండు స్థానాలను వదలడమే ఇందుకు నిదర్శనం. అప్నాదళ్, అజిత్ సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ దళ్ ప్రభావం ఒకటి, రెండు ప్రాంతాలకే పరిమితం.తాజా పరిణామాల నేపథ్యంలో హస్తం పార్టీ యూపీపై దృష్టి సారించింది. తనకు చెప్పకుండా మాయావతి, అఖిలేష్ యాదవ్ లు ఏకపక్షంగా కూటమి కట్టడంపై కాంగ్రెస్ పార్టీ కుతకుతలాడుతోంది. మరీ రెండంటే రెండు సీట్లు కేటాయించడంపై కోపంతో ఉంది. జాతీయ స్థాయిలో ప్రాధాన్యం గల తమను మరీ అంత తక్కువగా అంచనా వేయడంపై ఆగ్రహంగా ఉంది. యూపీపై హస్తం పార్టీ   దృష్టి 

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జుల్లో ఒకరైన జ్యోతిరాదిత్య సింధియా మాటల్లో ఈ ఆగ్రహం వ్యక్తమయింది. ఎస్పీ, బీఎస్పీ పొత్తును గౌరవిస్తూనే అవసరమైతే తామే ఆ పార్టీలకు రెండు, మూడు సీట్లను వదిలేస్తామన్న సింధియా వ్యాఖ్యలు పార్టీ వైఖరికి అద్దంపడుతున్నాయి. యూపీలో పట్టు సాధించనిదే జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత ఉండదని గ్రహించిన హస్తం పార్టీ మొడట నుంచీ ఆ మేరకు పావులు కదుపుతోంది. ప్రాంతీయ పార్టీలు తమను పక్కన పెడతాయని గ్రహించిన కాంగ్రెస్ తన జాగ్రత్తలో తాను ఉంది. అనారోగ్యం కారణంగా ఈసారి పోటీకి దూరమని ప్రకటించిన పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మనసు మార్చుకున్నారు. తాను పోటీ చేయకపోతే ఆ ప్రభావం పార్టీపై పడుతుందని గ్రహించిన ఆమె తన నిర్ణయాన్ని తిరగరాశారు. అదే విధంగా కూతురు ప్రియాంక గాంధీ, మధ్యప్రదేశ్ కు చెందిన నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాలకు రాష్ట్ర బాధ్యతలను అప్పగించారు. ప్రియాంక రాజకీయ అరంగేట్రంపార్టీకి మేలు చేస్తుందన్నది భావన. ముఖ్యంగా అగ్రవర్ణాల వారిని ఆమె ఆకట్టుకోగలగదని అంచనా వేస్తోంది. ప్రియాంకను మరోచోట నుంచి బరిలోకి దించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. తల్లి, కుమారుడు, కుమార్తె పోటీ చేస్తే పార్టీ శ్రేణుల్లో ఊపు వస్తుందని భావిస్తోంది. దీనితో పాటు సీనియర్ నాయకులను బరిలోకి దించాలని యోచిస్తోంది. తద్వారా ఎస్పీ, బీఎస్పీలకు బలమైన సందేశాన్ని పంపింది.ఇంతటితో ఆగకుండా ఏకంగా 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. వారంతా ఆ యా నియోజకవర్గాల్లో పట్టున్న వారే. వీరిలో జితిన్ ప్రసాద్ (దౌరహర) ఒకరు. ప్రసాద్ తండ్రి గతంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 90వ దశకంలో పార్టీ అధ్యక్ష పదవికోసం ఏకంగా సోనియాగాంధీపై పోటీచేసి సంచలనం సృష్టించారు. ఫరూనైబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ బరిలోకి దిగనున్నారు. ఈయన తాత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ తొలి విద్యాశాఖ మంత్రి. సల్మాన్ ఖుర్షీద్ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అనుటాండన్ (ఉన్నావ్), రాజా రాంపాల్ (అక్బర్ పూర్), నిర్మల్ ఖత్రి (ఫైజాబాద్), రతన్ జీత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ (కుశినగర్) లో బరిలోకి దిగుతున్నారు. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఇమ్రాన్ మసూద్ కు షహరాన్ పూర్ స్థానాన్ని కేటాయించారు.వాస్తవానికి యూపీ హస్తం పార్టీకి మొదటి నుంచి పెట్టని కోట. బీజేపీ ఆవిర్భావం, ప్రాంతీయ పార్టీల రాకతో దాని ప్రభావం అడుగంటింది. అయినప్పటికీ అప్పుడప్పుడూ మంచి పనితీరు కనబర్చింది. 2004 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ 9 స్థానాలు సాధించి తన ఉనికిని కాపాడుకుంది. అప్పట్లో ఎస్పీ 35, బీఎస్పీ 10 స్థానాలను గెలుచుకున్నాయి. పది స్థానాలను గెలుచుకున్న బీజేపీ 2014లో ఘనవిజయం సాధించిందని, తాము కూడా ఏదో ఒకరోజు ఆ స్థాయికి ఎదుగుతామన్న ఆశాభావంతో హస్తం పార్టీ ఉంది. అనుకున్నట్లుగానే 2009లో పార్టీ మంచి పనితీరు కనబరిచింది. 21 స్థానాలను సాధించి రెండో అతి పెద్ద పార్టీగా నిలిచింది. అప్పట్లో ఎస్పీ 23, బీఎస్పీ 20 సీట్లు సాధించాయి. గత ఏడాది రాష్ట్రంలో జరిగిన మూడు లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానాలను కాపాడుకోలేకపోయింది. గోరఖ్ పూర్, కైరానా, పూల్ పూర్ లో ఓటమి పాలయింది. గోరఖ్ పూర్ నుంచి ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాధ్ అయిదుసార్లు ఎంపీగా గెలిచారు. అయినా ఆ స్థానాన్ని నిలుపుకోలేక పోయింది. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాతినిధ్యం వహించిన ఫూల్ పూర్ స్థానాన్ని సయితం నిలబెట్టుకోలేకపోయింది. ఇది తొలి ప్రధాని నెహ్రూ సొంత నియోజకవర్గం. ఇక కైరానా స్థానాన్ని సయితం బీజేపీ కోల్పోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని సద్వినియోగం చేసుకుంటే గౌరవప్రదమైన స్థానాలను సాధించవచ్చన్నది హస్తం పార్టీ అంచనా. పాత వైభవాన్ని సాధించడం ద్వారా తనను అవమానపర్చిన ఎస్పీ, బీఎస్పీలను దెబ్బతీయాలన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉంది. ఈ దిశగా పార్టీ పావులు కదుపుతోంది.

No comments:

Post a Comment