Breaking News

20/03/2019

తెలంగాణలో కనిపించని మహాకూటమి

హైద్రాబాద్, మార్చి 20, (way2newstv.in)
అసెంబ్లీ ఎన్నికల నాటి ‘మహా కూటమి’ విచ్చిన్నమైంది. ప్రస్తుతం లోక్‌సభకు జరగనున్న ఎన్నికలకు ఎవరికి వారే స్వయంగా పోటీ చేయాలని కూటమి నేతలు భావిస్తున్నారు. మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహా’కూటమి విఫలం కావడంతో ఈ దఫా ఏ పార్టీ కూడా ‘కూటమి’గా ఏర్పడేందుకు చొరవ చూపలేదు. ఇలాఉండగా మల్కాజిగిరి లోక్‌సభ నుంచి పోటీ చేయాల్సిందిగా కాంగ్రెస్ అధిష్ఠానం మాజీ ఎమ్మెల్యే, టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డిని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి జన సమీకరణతో పాటు, వివిధ పార్టీల (నాటి కూటమి) నేతల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.కూటమి లేకపోయినా తన విజయానికి సహకారం అందించాల్సిందిగా ఆయన స్వయంగా వివిధ పార్టీల నేతలను కలుసుకుని కోరుతున్నారు. 



తెలంగాణలో కనిపించని మహాకూటమి

తార్నాకలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ నివాసానికి రేవంత్ వెళ్ళి తనకు మద్దతునివ్వాల్సిందిగా కోరారు. ఈ విషయంపై తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. సీపీఐ రాష్ట్ర నేతలతో చర్చించి మద్దతు పొందారు. అంతకు ముందు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణతో, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డితో రేవంత్ మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే కూటమి లేనందున, అధికారికంగా తాము మద్దతునివ్వలేమని, స్థానికంగా మద్దతు కూడగట్టుకోవాలని వారు రేవంత్‌కు సలహా ఇచ్చినట్లు తెలిసింది.
ఇలాఉండగా బీజేపీ నాయకుడు బీ. గణేష్‌తో రేవంత్ రెడ్డి చర్చలు జరపడం చర్చనీయాంశమైంది. వైరి పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎలా చర్చించారని అన్ని పార్టీల నాయకులు విస్మయం చెందుతున్నారు. అయితే గణేష్‌ను వ్యక్తిగత పరిచయాలతో రేవంత్ కలిసి మద్దతు కోరారని ఆయన అనుయాయులు చెబుతున్నారు.

No comments:

Post a Comment