Breaking News

22/03/2019

సాకారం కాని సాక్షరభారత్ (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, మార్చి 22 (way2newstv.in): 
అక్షరాస్యతను పెంచే సాక్షరభారత్‌ పథకం ఏడాదిగా నిలిచిపోయింది. వయోజన విద్యాకేంద్రాలు మూతపడ్డాయి. పథకం ఎప్పుడో ముగిసినా రెండు సార్లు గడువు పెంచుతూ వచ్చారు. 2018 మార్చి నుంచి పూర్తిగా ఆగిపోయింది. దీని స్థానంలో కేంద్ర ప్రభుత్వం ‘పఢ్‌నా.. లిఖ్‌నా అభియాన్‌’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. సాక్షరభారత్‌ కోసం పని చేసిన గ్రామ, మండల సమన్వయకర్తలు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
దేశంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించాలన్నా లక్ష్యంతో 2009 డిసెంబర్‌ 8న అప్పటి కేంద్రం సాక్షరభారత్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాది తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రారంభమైంది. అన్ని పంచాయతీల్లో వయోజన విద్యా కేంద్రాలు వెలిశాయి. ఈ కేంద్రాలల్లో 15 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న నిరక్షరాస్యులకు రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు బోధించేవారు. ఇందుకోసం గ్రామ, మండల సమన్వయకర్తలను నియమించారు. కేంద్రాల్లో చదువుకునే వారికి ఏడాదికి రెండు సార్లు ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌’ పరీక్షలు నిర్వహించేవారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే మూడో తరగతి చదివినట్టు లెక్క. తర్వాత ఆసక్తి గలవారు సార్వత్రిక విద్యా విధానం ద్వారా 5, 7, 10 పూర్తి చేసే అవకాశం ఉంటుంది.


సాకారం కాని సాక్షరభారత్ (ఆదిలాబాద్)

వయోజన విద్యా కేంద్రాలల్లో చదువుకున్న వారికి ఉపాధి హామీ పథకంలో ప్రాధాన్యం దక్కేది. వీటిని నడిపించేందుకు ప్రతి చోట వెయ్యి వరకు పుస్తకాలు, బల్లలు, తదితర సామగ్రి అందుబాటులో ఉంచారు. దీని స్థానంలో కొత్త పథకాన్ని అమలు చేస్తామనడంతో రాబోయే పథకం మరింత మెరుగ్గా ఉంటుందని భావించారు. పాతది రద్దు చేశారు తప్పితే కొత్త పథకాన్ని అమలు చేయలేకపోవడంతో అక్షరాస్యతలో వెనుకబడే ప్రమాదం ఉందని, త్వరగా కొత్త పథకాన్ని ప్రారంభించాలని వయోజనులు కోరుతున్నారు. నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాలు నేర్పించడం సమన్వయకర్తల పని. మండలానికి ఒక సమన్వయకర్త, 0పంచాయతీకి ఇద్దరు సమన్వయకర్తల చొప్పున నియమించారు. మండల సమన్వయకర్తలకు రూ.6 వేలు, గ్రామ సమన్వయకర్తలకు నెలకు రూ.2 వేల చొపున వేతనాలు చెల్లించే వారు. ఈ పథకం రద్దు కావడంతో వారికి ఇంకా కొన్ని నెలల వేతనాలు రాలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పథకంలో వేతనాల చెల్లింపు ఎలా ఉంటుందోనని గ్రామ, మండల సమన్వయకర్తల్లో సందిగ్ధం నెలకొంది.
సాక్షరభారత్‌ పథకంలో పని చేసిన గ్రామ, మండల సమస్వయకర్తల భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. పథకం ఆగిపోవడంతో వేతనాలు అందడం లేదు. దీంతో వారంతా ఉపాధి కోల్పోయారు. వచ్చే కొద్ది వేతనంతో కష్టమైనా కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. ప్రస్తుతం వారంతా ఖాళీగా ఉంటూ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు అందులో పని చేయడంతో వేరే పని ప్రస్తుతం దొరకని పరిస్థితి. కొత్త పతకాన్ని ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆనందంలో మునిగిపోయారు. కానీ ప్రకటన మిగిలింది తప్పితే ప్రారంభం కాలేదు. దీంతో సమన్వయకర్తలు నిరాశకు గురవుతున్నారు. త్వరగా పఢ్‌నా..లిఖ్‌నా అభియాన్‌ ప్రారంభించాలని కోరుతున్నారు.

No comments:

Post a Comment