Breaking News

07/03/2019

చల్లా..చెదురు చేస్తారా

కర్నూలు, మార్చి 7, (way2newstv.com)
చల్లా రామకృష్ణారెడ్డి. ఒకప్పుడు రాయలసీమలో తిరుగులేని నేత. అయితే ఆయన గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు తనను పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తేనే వచ్చానని చల్లా రామకృష్ణారెడ్డి చెప్పారు. చల్లా రామకృష్ణారెడ్డికి బనగానపల్లె నియోజకవర్గంలో మంచి పట్టుంది. గత ఎన్నికల్లో బనగానపల్లి టీడీపీ టిక్కెట్ బీసీ జనార్థన్ రెడ్డికి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ నుంచి హామీ రావడంతోనే చల్లా అప్పుడు బీసీ జనార్ధన్ రెడ్డి విజయం కోసం పనిచేశారుఅయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చల్లాను టీడీపీ అధినాయకత్వం పట్టించుకోలేదు. ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు. దీంతో గతకొంతకాలంగా ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. 


చల్లా..చెదురు చేస్తారా

చల్లా రామకృష్ణారెడ్డి కొంతకాలం క్రితం శిల్పా చక్రపాణిరెడ్డి ఖాళీ చేసిన కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి అయినా వస్తుందేమోనని భావించారు. కానీ ఆ టిక్కెట్ కేఈ ప్రభాకర్ కు ఇవ్వడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు.కడప ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ పదవి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చారు. అయితే ఆ పదవిని చల్లా తిరస్కరించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి ఛైర్మన్ పదవి ఇచ్చి తనకు రీజనల్ ఛైర్మన్ పదవి ఇస్తారా? అని మండిపడ్డారు. తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని అప్పట్లోనే సంచలనం సృష్టించారు. దీంతో చంద్రబాబు హడావిడిగా చల్లా వద్దకు దూతలను పంపి శాంతింప చేశారు.చల్లాకు తర్వాత ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఎన్నికల వేళ బనగానపల్లె టిక్కెట్ తనకు వస్తుందని చల్లా భావించారు. అయితే అధినేత నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవడం, బీసీ జనార్థన్ రెడ్డికే తిరిగి టిక్కెట్ ఖారారు కావడంతో చల్లా రామకృష్ణారెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. తన వల్లనే బీసీ జనార్థన్ రెడ్డి గత ఎన్నికల్లో గెలిచారని గుర్తుంచుకోవాలంటున్నారు. ఆయన వైసీపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం మీద ఎన్నికల వేళ చల్లా రామకృస్ణారెడ్డి పార్టీని వీడటం బనగాన పల్లెలో టీడీపీకి దెబ్బేనన్నది విశ్లేషకుల అంచనా.

No comments:

Post a Comment