గుంటూరు, మార్చి 27 (way2newstv.in)
గుంటూరు లోక్ సభ స్థానం హాట్ సీటుగా మారింది. ఇద్దరూ ఉద్దండులే. ఎవరికి ఎవరూ తీసిపోరు. ఒకరు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్. మరొకరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ఇద్దరూ నిన్నటి వరకూ ఒకే పార్టీలో ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా పనిచేశారు. నిన్నటి వరకూ మిత్రులే. నేడు ప్రత్యర్థులుగా మారారి. గుంటూరు పార్లమెంటు సీటును ఎలాగైనా దక్కించుకోవాలని ఇటు వైసీపీ, ఇటు టీడీపీ చెమటోడుస్తున్నాయి. అయితే అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దిగిన ఎమ్మెల్యేల సత్తాను బట్టే వీరి గెలుపు ఆధారపడి ఉంటుంది.గుంటూరు లోక్ సభ స్థానం పరిధిలో తాటికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలున్నాయి. ఈ పరిధిలోని ఎమ్మెల్యేల అభ్యర్థుల విజయావకాశాలను బట్టే ఎంపీ గెలుపు ఆధారపడి ఉంటుంది. కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఇప్పటి వరకూ గుంటూరు లోక్ సభ నియోజకవర్గం పరిధిలో కమ్మ సామాజిక వర్గానిదే ఆధిపత్యం.
ఉద్దండుల మధ్య హోరాహోరి
ఎక్కువ సార్లు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలే గెలుపొందారు. 1991లో తెలుగుదేశం పార్టీ నుంచి లాల్ జాన్ భాషా మాత్రమే గెలిచారు. మూడు సార్లు మాత్రమే ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. రాయపాటి సాంబశివరావు అత్యధికంగా ఇక్కడి నుంచి నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు.గత ఎన్నికల్లో గల్లా జయదేవ్ వైసీపీ అభ్యర్థి బాలశౌరిపై 70 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, తాటికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాలు కొంత టీడీపీకి పట్టున్నాయంటున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తుండటంతో అక్కడ కూడా ఎంపీ అభ్యర్థికి భారీ మెజారిటీ వస్తుందని ఆశపెట్టుకున్నారు. పొన్నూరు, తెనాలిలో, తాటికొండ నియోజకవర్గాల్లో సయితం ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వంట అభ్యర్థులు ఉండటంతో గల్లా జయదేవ్ బిందాస్ గా ఉన్నారు. రాజధానికి పక్కనే ఉండటం కూడా తనకు కలసి వస్తుందని, అభివృద్ధిని చూసి ఓట్లేస్తారని ఆయన భావిస్తున్నారు.ఇక వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాలు అండగా నిలుస్తాయంటున్నారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉండటంతో తనకు ఖచ్చితంగా మెజారిటీ వస్తుందని నమ్ముతున్నారు. గుంటూరు పశ్చిమ నుంచి నిన్నటి దాకా తానే ఎమ్మెల్యేగా ఉండటంత తనకు కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. తెనాలి, పొన్నూరు ల్లో కూడా తనకే మెజారిటీ వస్తుందని మోదుగుల ధీమాగా ఉన్నారు. తాను స్థానికుడనని, గల్లా జయదేవ్ పార్ట్ టైం ఎంపీ అని ఆయన ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. మోదుగుల గుంటూరు ఎంపీ స్థానం నుంచి గెలుపొందితే రికార్డు బ్రేక్ చేసినట్లే.
No comments:
Post a Comment