తిరుపతి, మార్చి 2 (way2newstv.com)
కంచె చేనును మేసింది. ఎర్ర చందనాన్ని పరిరక్షించాల్సిన ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం అధికారి ఒకరు ఎర్రచందనం స్మగ్లర్లతో చేతులు కలిపాడు. వారి తో పాటు అక్రమ రవాణాకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే,
తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం వద్దనున్న రెడ్ శ్యాండిల్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఎస్ఐగా పనిచేస్తున్న సోమశేఖర్ శుక్రవారం రాత్రి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ తిరుపతి అర్బన్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. అతనితో పాటు నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 21 దుంగలు, ఒక ఇన్నోవా కారు, ఒక లగేజీ జీపులో టమోటా లోడ్ గల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ లో పోలీసు ఎస్సై
సుమారు 600 కిలోల గల ఎర్రచందనం విలువ అక్షరాల పద్నాలుగు లక్షల రూపాయలు. ఈ సందర్భంగా తిరుపతి ఈస్ట్ డిఎస్పీ నాగేశ్వర రావు మాట్లాడుతూ తిరుపతి అర్బన్ లోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ చంద్రబాబుకి వచ్చిన సమాచారం మేరకు రాత్రి లీలా మహల్ వద్ద నుండి లక్ష్మీ పురం సర్కిల్ వరకు వాహన తనిఖీలు చేపట్టారు. వాహన తనిఖీలో భాగంగా తనిఖీ చేస్తుండగా ఎస్ఐ సోమశేఖర్ ఇన్నోవా కారులో కూర్చోని వెనుకనున్న వాహనం తనదేనంటూ వదిలేయమని అన్నాడు. అయినా, సీఐ చంద్రబాబు తనిఖీలు నిర్వహించారు. ట్రాలీలో టమోటాల కింద దాచిని 21 ఎర్రచందనం దుంగలను గుర్తించి వారిని అరెస్టు చేశారు. పట్టుబడ్డ వారిలో రామిరెడ్డి పల్లెకు చెందిన వినాయక రెడ్డి, కేరళ రాష్ర్టానికి చెందిన ఉమర్, తిరుపతికి చెందిన తుపాకుల శివ, తమిళనాడుకు చెందిన డ్రైవర్ ఆండియన్ లు వున్నారు. వీరి నుండి మరింత సమాచారం రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణాలో పాల్గొన్న ఎస్ఐ సోమశేఖర్ ను రెడ్ శ్యాండిల్ టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతా రావు విధుల నుండి తొలగించి, కర్నూలు రేంజ్ డిఐజీకి చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
No comments:
Post a Comment