Breaking News

13/02/2019

నాగబాబు...ఇదేమి భావ ప్రకటన

హైద్రాబాద్, ఫిబ్రవరి 13, (way2neewstv.in)
మై ఛానెల్‌ నా ఇష్టం’ పేరిట యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించాడు మెగా బ్రదర్ నాగబాబు. దీని ద్వారా తన పొలిటికల్ వ్యూను అభిమానులతో పంచుకుంటానని ప్రకటించాడు. ఇందులో తన రాజకీయ అభిప్రాయాలను మాత్రమే పంచుకుంటానని చెప్పిన నాగబాబు.. ఇది కేవలం నవ్వుకోవడానికి మాత్రమేనని, దీనిని సిరీయస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. కానీ, చాలా మందికి కోపం వచ్చే వీడియోలనే చేస్తున్నాడు. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఆయన టార్గెట్ చేశాడు. మొదటిగా ఏపీ మంత్రి నారా లోకేష్‌ వీడియోను చేసిన నాగబాబు.. ఆ తర్వాత వరసగా చంద్రబాబు, జగన్‌కు సంబంధించిన వీడియోలు చేశాడు. వీటిని చూసిన ఆయా పార్టీల అభిమానులు కోపంతో రగిలిపోతున్నారు. 


 నాగబాబు...ఇదేమి భావ ప్రకటన

ఇంతలోనే మరో వీడియోతో వచ్చేశాడాయన. ఈసారి తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా ఓ వీడియోను రూపొందించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు పిల్లలు సైకిల్ తొక్కుతూ కనిపిస్తారు. అందులో ఒక పిల్లాడు ఆనందంతో సైకిల్‌పై రౌండ్లు వేస్తుంటాడు. మరో పిల్లాడు సైకిల్‌ని కింద పడేసి దాన్ని కాలితో తన్నుతుంటాడు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన నాగబాబు ఆనందంగా సైకిల్ తొక్కుతున్న అబ్బాయిని ‘‘బాబూ.. ఏం చేస్తున్నావ్..?’’ అని ప్రశ్నిస్తాడు. దానికి ఆ పిల్లాడు ‘‘సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి మంచిది అని తొక్కుతున్నా అంకుల్’’ అని బదులిస్తాడు. ఇక సైకిల్‌ని కిందేసి తొక్కుతున్న పిల్లాడిని ‘‘నువ్వు ఏం చేస్తున్నావ్ బాబూ’’ అని అడుగుతాడు. దానికి ఆ బాలుడు ‘‘సైకిల్‌ని తొక్కితే ఆంధ్రప్రదేశ్‌కే మంచిదని తొక్కుతున్నా అంకుల్’’ అంటూ పళ్లు బిగబెట్టి కింద పడి ఉన్న సైకిల్‌ను కాలితో తన్నుతుంటాడు. ఇక చివరిగా నాగబాబు వీడియోలో కనిపిస్తూ ‘‘ఆరోగ్యం బాగుండాలి అంటే సైకిల్ తొక్కాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్‌నే తొక్కాలి’’ అంటూ చెబుతాడు. అంతేకాదు, ‘‘ఇందులో వాహనం ఏ వ్యక్తికి సంబంధించినది కాదు.. ఒక సైకిల్ కంపెనీకి మేం ఇచ్చిన యాడ్’’ అంటూ ముగిస్తాడు. ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి టీడీపీ అభిమానులు నాగబాబుపై విరుచుకుపడుతున్నారు.వాస్తవానికి నాగబాబు.. తన తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరపున ప్రచారం చేసుకుంటున్నాడు. ఇంత వరకు బాగానే ఉంది కానీ, మిగిలిన పార్టీలను ఘోరంగా అవమానిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన వీడియోలు ఒక ఎత్తు తాజాగా చేసిన సైకిల్ వీడియో ఒక ఎత్తు. ఎందుకంటే నాగబాబు టీడీపీ గుర్తు అంటే నందమూరి తారక రామారావు పార్టీని ఏర్పాటు చేసి, సంపాదించిన గుర్తు సైకిల్. అలాంటి దానికి కింద పడేసి పిల్లాడితో తొక్కించాడు. అంతేకాదు, ‘ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్‌నే తొక్కాలి’ అంటూ నాగబాబు వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించాడు. అంటే, టీడీపీని వదిలేసి జనసేనకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని ఆయన చెబుతున్నారా..? సైకిల్‌నే తొక్కాలి అంటే అర్థం అదే కదా. తమ్ముడి తరపున వకాల్తా పుచ్చుకుని ఆయన ఏం చేసుకున్నా పర్లేదు.. కానీ, వేరే వారిని కించపరిస్తే ఎవరూ స్వాగతించరు. ఈ విషయాన్ని నాగబాబు ఎప్పటికి తెలుసుకుంటారో చూడాలి.

No comments:

Post a comment