Breaking News

18/02/2019

ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ పై రాని క్లారిటీ

నిజామాబాద్, ఫిబ్రవరి 18, (way2newstv.in)
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఉపసర్పంచ్‌లకు ప్రస్తుతం చెక్ పవర్ టెన్షన్ పట్టుకుంది. గ్రామపంచాయతీ నిధులను విడుదల చేసే అధికారం, జాయింట్ చెక్ పవర్ గతంలో సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శిల మధ్య ఉండగా, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పంచాయతీరాజ్ చట్టం 2018లో సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన 4, 383 గ్రామపంచాయతీతో కలుపుకొని మొత్తం 13,073 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇటీవల మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా, కొత్త సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఫిబ్రవరి 2వ తేదీన తమ పదవి బాధ్యతలను స్వీకరించారు.


ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ పై రాని క్లారిటీ

గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరీ పక్షం రోజులు కావస్తున్నా నేటికీ తెలంగాణ సర్కారు జాయింట్ చెక్ పవర్‌పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపసర్పంచ్‌లు అయోమయంలో పడ్డారు. కొత్త చట్టం ప్రకారం సర్పంచ్‌తో సమానంగా తమకు చెక్ పవర్ వస్తుందనే ఆశతో కొన్ని జీపీల్లో ఉపసర్పంచ్ పదవిని రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఖర్చు పెట్టి కైవసం చేసుకున్న వ్యక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నట్లు తెలిసింది.తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పించాలని తీసుకున్న నిర్ణయంపై సర్కారు పునా రాలోచనలో పడినట్లు తెలుస్తోంది. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్కు పవర్ కల్పిస్తే ఆజాయిషీ చేసే అధికారం పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులకు ఉండకపోవచ్చని, తద్వారా పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. పంచాయతీ నిధుల దుర్వినియోగం అయితే తన ప్రభుత్వ ఉద్యోగం పోతుందనే భయంతో పంచాయతీ కార్యదర్శి నిజాయితీగా పనిచేసే అవకాశం ఉందని, గతంలో మాదిరిగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలకే జాయింట్ చెక్కు పవర్ కల్పించాలని, సీఎం కేసీఆర్, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.కొత్త చట్టంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తామని తెలిపినప్పటికినీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ఆదేశాలు గానీ, ఉత్తర్వులు గానీ రాలేదని తెలిపారు. జాయింట్ చెక్ పవర్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో బ్యాంకుల్లో  గ్రామపంచాయతీల పేరిట ఇప్పటివరకు ఖాతాలు తెరువలేదని డీపీఓ తెలిపారు.

No comments:

Post a Comment