కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూర్బన్ పథకం పుణ్యమా అంటూ జుక్కల్ మండలానికి కోట్లాది రూపాయలు మంజూరయ్యాయి. వివిధ రంగాలను అభివృద్ధి చేసేందుకు చక్కటి అవకాశం. ఈ పథకం మూడేళ్ల పాటు కొనసాగుతుంది. ఈ ఏడాదే చివరిది. పనులన్నీ పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎక్కువ పనులు పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోనే ఉన్నాయి. వ్యవసాయాధారిత మండలంగా పేరుగాంచిన జుక్కల్ మండలంలో రైతులే ఎక్కువ. ఇక్కడ పండించే పంటలే వినూత్నం. ఎలాంటి మార్కెట్ యార్డు లేకపోవడంతో మద్దతు ధర రాకున్నా ..ముందే దిగుబడిని విక్రయించుకునే పరిస్థితి. అయితే రైతన్నల కోసం, వ్యవసాయ రంగ అభివృద్ధికి మండలంలో గిడ్డంగుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఏడాది కాలంగా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.
నీడ లేదు (నిజామాబాద్)
మండలంలోని మొత్తం 30 పంచాయతీల పరిధిలో సుమారు 15వేల మంది రైతులు ఉన్నారు. ఆరుతడి పంటలే ఎక్కువగా పండిస్తారు. ప్రధాన గ్రామాల్లో గిడ్డంగులను నిర్మించేందుకు మండల వ్యాప్తంగా తొమ్మిది గిడ్డంగులకు రూర్బన్ పథకంలో రూ.3.15 కోట్లు మంజూరయ్యాయి. వీటి పనులు పూర్తవ్వగానే గుత్తేదారులు బిల్లులు తీసుకోవచ్చు. బిల్లు చెల్లింపులో ఎలాంటి జాప్యం లేదు. అయినా గుత్తేదారులు నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నారు. ఇంతకాలం ఎన్నికల కోడ్ పేరుతో అధికారులు అలసత్వం వహించారు. తొమ్మిదింటిలో నాలుగు పనులే పూర్తయ్యాయి. ఇందులోనూ ఒక్క గిడ్డంగిని మాత్రమే ప్రారంభించారు. మిగతా వాటిలో చిన్న చిన్న పనులు చేయాల్సి ఉంది.
ప్రధానంగా మూడు, నాలుగు గ్రామాల రైతులు గిడ్డంగిలో తమ దిగుబడిని నిల్వ ఉంచుకునేలా అక్కడక్కడ వీటిని నిర్మిస్తున్నారు. పనులు పూర్తయితే రైతులకు ఎంతో మేలు జరగనుంది. వరి ధాన్యం, శనగ, సోయా, కంది పంటల మద్దతు ధర వచ్చే వరకు గిడ్డంగుల్లో దాచుకోవచ్చు. పనులు సకాలంలో పూర్తి కాకపోతే నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.1.31 కోట్లను గుత్తేదారులకు బిల్లుల రూపంలో చెల్లించినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. వీటి పనులన్నీ పంచాయతీరాజ్ శాఖ అధికారులే చూసుకోవాల్సి ఉంది. కానీ పెద్దగా దృష్టి సారించడం లేదు.
No comments:
Post a Comment