Breaking News

20/02/2019

సంగమేశ్వర జాతరకు అంతా సిద్దం

మార్చి3 అర్ధరాత్రి నుంచి జాతర ప్రారంభం
వేల మంది భక్తులు వచ్చే అవకాశం
ఖమ్మం, ఫిబ్రవరి 20 (way2newstv.in): 
త్రివేణి సంగమం తీర్థాల సంగమేశ్వర ఆలయం జాతరకు ముస్తాబవుతోంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు శైవక్షేత్రాలకు బారులు తీరుతారు. మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాల్లో నిర్వహించే జాతరలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పెద్దజాతర తీర్థాల కూడలి జాతర. ఇక్కడ మూడు ఉపనదులు కలిసి ఉండటం వల్ల భక్తులు మహాశివరాత్రి సందర్భంగా మూడు నదులు కలిసే చోట పుణ్యస్నానాలు ఆచరిస్తే శుభం కలుగుతుందనే నమ్మకంతో తీర్థాలకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆలయ అధికారులు, సిబ్బంది, అన్ని శాఖల అధికారులు జాతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 


సంగమేశ్వర జాతరకు అంతా సిద్దం

ఖమ్మం గ్రామీణ మండలం తీర్థాల సంగమేశ్వర ఆలయం వద్ద మార్చి3 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్న జాతర ఏర్పాట్లపై . ప్రత్యేక కథనం
తీర్థాల సంగమేశ్వర ఆలయం మున్నేరు, ఆకేరు, బుగ్గేరు మూడు ఉపనదులు కలిసే చోట నెలకొని ఉంది. ఇక్కడ శివుడు సంగమేశ్వరుడి రూపంలో గంగా, పార్వతి సమేతంగా కొలువై ఉన్నాడు. మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేస్తుంటారు. ఇక్కడ మూడు నదులు కలిసి ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. త్రివేణి సంగమం చోట మహాశిరాత్రి రోజు పుణ్యస్నానాలు ఆచరిస్తే శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇటువంటి పరిస్థితులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడా లేకపోవడం వల్ల భక్తులు ఇక్కడ నిర్వహించే జాతరకు వేలసంఖ్యలో తరలివస్తుంటారు. ఇక్కడ జాతర అయిదు రోజులపాటు నిర్వహిస్తారు.
ఏర్పాట్లలో నిమగ్నమయిన అధికారులు: జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అధికారులు ఆయా శాఖల పరిధిలో చేయాల్సిన  పనులు చేస్తున్నారు. జాతరకు వేల మంది భక్తులు వస్తున్నందున వారికి ఎటువంటి లోటుపాట్లు కలుగకుండా ఉండేలా అధికారులు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
జాతర ఏర్పాట్లు: జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా, వాహనాల రద్దీకి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పల్లెగూడెం నుంచి మంగళగూడెం రహదారి మార్గంలో తీర్థాల సంగమేశ్వర ఆలయం ఉంది. ఈ రహదారి ఇరుకుగా ఉండటం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాహనాలను వివిధ రహదారులు, గ్రామాల మీదుగా ఆలయానికి చేరుకునేటట్లుగా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నలువైపులా పార్కింగ్ సౌకర్యం: తీర్థాల జాతరకు వచ్చే భక్తుల కోసం తీర్థాలకు నలువైపులా అధికారులు పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను దానవాయిగూడెం, రామన్నపేట మీదుగా కామంచికల్లు వరకు వచ్చి కామంచికల్లు వద్ద మున్నేటి ఒడ్డున పార్కింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి భక్తులు మున్నేరు దాటి ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. డోర్నకల్, ఎన్నారం వైపు నుంచి వచ్చే వాహనాల కోసం మంగళగూడెం వైపు... పల్లెగూడెం, పోలేపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలకు గోళ్లపాడు వైపు పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
మున్నేటిలో పుష్కలంగా నీళ్లు: ప్రస్తుతం సంగమేశ్వర ఆలయం వద్ద మున్నేటిలో నీళ్లు పుష్కలంగానే ఉన్నాయి. గోళ్లపాడు వద్ద చెక్డ్యాం నిర్మాణం పూర్తి చేయడం వల్ల తీర్థాల వద్ద కూడా నీళ్లు ఉన్నాయి. ప్రతి ఏడాది మున్నేటిలో నీళ్లు లేక అధికారులు ప్రత్యేకంగా ఎన్నెస్పీ అధికారులతో మాట్లాడి ఎన్నెస్పీ కాలువ నుంచి జాతరకు ప్రత్యేకంగా నీళ్లు తీసుకొచ్చే వారు. నీళ్లు తీసుకొచ్చేందుకు అధికారులు రాత్రింబవళ్లు శ్రమించాల్సి వచ్చేది ఈ ఏడాది ఆ ఇబ్బందులు తొలిగాయి.
మహిళా భక్తులకు ప్రత్యేక గదులు
మహిళా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దుస్తులు మార్చుకునేందుకు వీలుగా తాత్కాలిక గదులను ఏర్పాటు చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రస్తుతం 45 మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి.
కొనసాగుతున్న పనులు
జాతర ఏర్పాట్ల కోసం పనులు కొనసాగుతున్నాయి. ఇటీవలే ఆలయానికి రంగులు వేశారు. ఆలయ ప్రాంగణంలో దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రాంగణాన్ని చదును చేసే పనులు ప్రారంభించారు. తరువాత వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. జల్లు స్నానాల కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉంది. తాగునీటి కోసం బోర్లు మరమ్మతులు చేస్తున్నారు. మిషన్భగీరథ పథకం నుంచి పైపులైన్ల కనెక్షన్లను ఇవ్వాల్సి ఉంది. జాతరకు మూడు రోజుల ముందుగానే ఏర్పాట్లు మొత్తం పూర్తి చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు

No comments:

Post a Comment