Breaking News

04/02/2019

నిరాశలో పసుపు రైతుల అవస్థలు

నిజామాబాద్, ఫిబ్రవరి 4, (way2newstv.in)
వర్షాభావం.. అకాల వర్షాలతో ఎన్నో వ్యయ ప్రయాసలతో సాగైన పసుపు పంట చేతికొచ్చింది. కానీ, కాలం కలిసిరాక, దుంప ఊరక ఎకరాకు 20 క్వింటాళ్లు మించి దిగుబడి రాలేదు. సేద్యపు ఖర్చులు పెరిగాయి.. దిగుబడులు తగ్గాయి.. ఈ పరిస్థితుల్లో క్వింటా పసుపు రూ.10వేలు ఉంటేగానీ గిట్టుబాటు కాదు. అలాంటిది ప్రస్తుతం రూ.4వేల నుంచి రూ. 5వేల మధ్యనే ధర ఊగిసలాడుతోంది. ఇదే సమయా నికి గతేడాది గరిష్టంగా రూ.8,681 ధర పలికింది. ప్రస్తుతం మార్కెట్‌ ధరలతో రైతులకు పెట్టుబడులూ దక్కేలా లేవు. కేంద్రం అమల్జేస్తానన్న'మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీం' అమలులోనూ తాత్సారం జరుగుతోంది.పసుపు సాగుకు ఏయేటికాయేడు ఖర్చులు పెరుగుతున్నాయి. ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడి అయింది. విత్తనం, ఎరువులు మొదలు ఉడకబెట్టడం వంటి వ్యయాలు తడిసి మోపడయ్యాయి. మరోవైపు పంట సాగు మధ్యలో అకాలవర్షం, ప్రారంభంలో వర్షాభావంతో దుంప మొఖంపుచ్చు వచ్చి సరిగా ఊరలేదు. ఫలితంగా ఏడాది పొడవునా నానా చాకిరి చేస్తే ఆయా ప్రాంతాల్లో ఒకరిద్దరికి మినహా ఎకరాకు 20క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు.


 నిరాశలో పసుపు రైతుల అవస్థలు

 ప్రస్తుతం నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో జనవరి ప్రారంభంలో క్వింటా రూ.6355 పలకగా, ఇప్పుడు రూ.5500లోపే పలుకుతోంది. ఇదే సమయానికి గతేడాది కనిష్టంగా 7,250, గరిష్టంగా రూ.8,681 వరకు పలికింది. తేమశాతం పేరుతో కొందరు దళారులు క్వింటా పసుపు రూ.3800 వరకు కోట్‌ చేయడం గమనార్హం. రూ.4వేల కన్నా తక్కువగా వ్యాపారులు కోట్‌ చేయకుండా సాఫ్ట్‌వేర్‌లోనే మార్పులు చేశామని చెప్పారు.రాష్ట్రంలోనే అత్యధికంగా పసుపు సాగయ్యే నిజామాబాద్‌ జిల్లాలో ప్రధానంగా ఆర్మూర్‌ డివిజన్‌లోని ఆర్మూర్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, భీంగల్‌, ఏర్గట్ల, మెండోరా, ముప్కాల్‌ మండలాల్లో అత్యధికంగా సాగైంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 33వేల 55 ఎకరాలు కాగా, 34వేల 914 ఎకరాల్లో పంట సాగు చేశారు. జనవరి నుంచి పంట మార్కెట్‌లో అమ్మకాలకు వస్తోంది. గతేడాది ఇదే సీజన్‌లో నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయానికి 9లక్షల క్వింటాళ్ల పసుపు తీసుకురాగా, ఆ ఏడాది మొత్తంగా 12లక్షల క్వింటాళ్ల వరకు వచ్చింది. ప్రస్తుతం జనవరి ప్రారంభం నుంచి పంట మార్కెట్‌లోకి వస్తోంది.పంటలకు కనీస మద్దతు ధర అందని సమయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం 'మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీం(ఎంఐసీ)'ని కేంద్రం అమలు చేస్తోంది. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతులకు కనీస ధర అందని సమయంలో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ఎంఐసీ కింద కేంద్ర ప్రభుత్వం బోనస్‌ ప్రకటించింది. అయితే, తెలంగాణాలో పసుపు రైతులకు కనీస మద్దతు ధర అందని పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం లేదు. మరోవైపు తిరిగి అధికారంలోకి వస్తే పసుపునకు గిట్టుబాటు ధర కల్పిస్తామని నవంబర్‌ 22న ఆర్మూర్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ అచరణకు నోచుకోవడం లేదు.

No comments:

Post a Comment