Breaking News

23/02/2019

పాలమూరు పోటీ కోసం ఫైట్

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 23, (way2newstv.in)
పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ ఒకటి, రెండు రోజుల్లో వెలువడుతుందన్న ప్రచారం సాగుతుండడంతో కాంగ్రెస్‌లో టికెట్ల హడావుడి మొదలైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. వీటిలో నాగర్‌కర్నూల్‌ ఎంపీగా కాంగ్రెస్‌ నేత నంది ఎల్లయ్య, మహబూబ్‌నగర్‌ ఎంపీగా టీఆర్‌ఎస్‌ నేత జితేందర్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి ఈ రెండు స్థానాలకు పోటీ చేయాలనుకున్న ఆశావహులు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో నాగర్‌కర్నూల్‌ స్థానానికైతే భారీ పోటీ నెలకొంది.  ఇప్పటికే పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఇటీవల ముగియగా.. వీటిని వడపోసి టీ పీసీసీకి అందజేసే బాధ్యతను జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులకు అప్పగించారు. దీంతో డీసీసీ అధ్యక్షులు ఒక్కో స్థానం నుంచి ఐదుగురితోకూడిన జాబితా రూపొందించి పీసీసీకి అందజేస్తారు. ఆ తర్వాత అక్కడ మళ్లీ స్క్రీనింగ్‌ అనంతరం ఏఐసీసీకి నివేదిస్తారు.


పాలమూరు  పోటీ కోసం ఫైట్

డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన డీకే.అరుణ, రేవంత్‌రెడ్డి, సంపత్‌కుమార్, జిల్లెల చిన్నారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, మల్లు రవి వంటి నేతలు అనేక మంది టీఆర్‌ఎస్‌ ప్రభంజనం ముందు తట్టుకోలేక ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో మహబూనగర్‌ స్థానం నుంచి బరిలోకి దిగి గెలిచి తీరాలని వీరిలో కొందరు భావిస్తున్నారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం జనరల్‌ రిజర్వేషన్‌ కాగా, నాగర్‌ కర్నూల్‌ ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానం. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో పార్టీ బలంగానే ఉండటంతో పోటీలో నిలవాలని వారి జాబితా కూడా అధికంగానే ఉంది. ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల టికెట్ల దరఖాస్తులు ఆహ్వానించడంతో మహబూబ్‌నగర్‌ పార్లమెంటు స్థానానికి 11 దరఖాస్తులు రాగా, నాగర్‌కర్నూల్‌ స్థానానికి అత్యధికంగా 36 దరఖాస్తులు వచ్చాయి.ప్రధానంగా డీ.కే అరుణ, రేవంత్‌రెడ్డిలు అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ స్థానం నుంచి టికెట్‌ కోసం వంశీచంద్‌రెడ్డి, చల్లా వెంకట్రాంమిరెడ్డి, కేవీఎన్‌.రెడ్డి, చిత్తరంజన్‌దాస్, సూగప్ప, సంజీవ్‌ ముదిరాజ్‌తో పాటు మరో ఐదుగురు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.వీటిని పరిశీలించిన జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఒక్కో పార్లమెంట్‌ స్థానం నుంచి ఐదుగురితో కూడిన జాబితాను టీ పీసీసీకి పీసీసీకి అందిస్తారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్‌ స్థానాలకు ఆశావాహులు అధికంగా ఉండటంతో జాబితాను రూపకల్పనలో డీసీసీల బాధ్యులు శ్రమించాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇలా ఒక్కో స్థానానికి ఐదుగురు పేర్లతో కూడిన జాబితాను టీ పీసీసీకి అందజేశాక.. అందులో నుంచి మూడేసి పేర్లతో ఏఐసీసీకి పంపిస్తారని సమాచారం. అనంతరం అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ఖరారు చేయనుంది.కాంగ్రెస్‌ పార్టీలో ఎక్కువ సార్లు సిట్టింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వడం ఆనవాయితీ. తద్వారా ఈసారి కూడా తనకే టికెట్‌ కేటాయించాలని నాగర్‌ కర్నూల్‌ ఎంపీ నంది ఎల్లయ్య మరోసారి అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్, మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి కూడా దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు.వీరే కాకుండా ఏ.చంద్రశేఖర్, మాణిక్యాల చెన్నయ్య, మల్లు రమేష్, కోటూరి మానవతారాయ్, కొండ్రు పుష్పలీల, పి.సుశ్మిత శంకర్‌రావు, పి.శంకర్‌రావు, లింగారం కృష్ణయ్య, రాచమల్ల యాదగిరి, డాక్టర్‌ బి.రమేష్, డి.హమ్సు వర్శ, ఎం.శివకుమార్‌ లాల్, మల్లేపల్లి జగన్, చిన్నగల్ల కొండయ్య, కె.విజయ్‌కుమార్, ఎం.జగన్, ప్రొఫెసర్‌ దేవదాస్‌ మాన్వాల్, దేవని సతీష్‌ మాదిగ, నాగరిగారి ప్రీతమ్, బొల్లు కిషన్, , పి.సుశ్మిత, పోకల కిరణ్‌ మాదిగ, కిష్టయ్య బీష్వ, కైలాష్‌ కుమార్, అరుణ్‌ కుమార్‌ మిద్దె, జే.నర్సింగ్‌రావు, గ్యార మహేందర్, కొమ్ము వెంకటస్వామి, పోలేని యాదగిరిరావు, డాక్టర్‌ సి.అనురాధ, కాటం జంబులయ్య, పుట్టపాగ మునీంద్రనాధ్, జల్‌పల్లి నరేందర్‌ కూడా నాగర్‌కర్నూల్‌ స్థానం నుంచి టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

No comments:

Post a Comment