Breaking News

02/02/2019

లోకేష్ పోటీపై వాడీ వేడి చర్చ

తిరుపతి, ఫిబ్రవరి 2, (way2newstv.in) 
నారా లోకేష్…. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన గత ఎన్నికల సమయంలోనే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత మంత్రిగా వచ్చేశారు. శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆయన మంత్రి పదవి చేపట్టారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ ఇప్పటికీ చురుకైన పాత్రనే పోషిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో లోకేష్ పోటీ చేస్తారా? లేదా? అన్నచర్చ పార్టీలోనే జరుగుతుండటం విశేషం.దొడ్డిదారిని మంత్రి అయిన లోకేష్ అంటూ విపక్షాలు ఆయనపై తరచూ విమర్శలకు దిగుతుండటం మనం చూస్తున్నాం. ప్రత్యక్ష రాజకీయాల్లో నెగ్గుకు రాలేక లోకేష్ ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారని విరుచుకుపడుతుంటారు. అయితే ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో లోకేష్ పోటీ చేస్తారని అందరూ భావించారు. ఆయన పెనమలూరు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. 


లోకేష్ పోటీపై వాడీ వేడి చర్చ

పెనమలూరు నియోజకవర్గం అయితే లోకేష్ కు ఇబ్బంది లేదని, అక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బోడే ప్రసాద్ కూడా లోకేష్ కోసం సీటును త్యాగం చేస్తానని చెప్పడంతో ఆయన పెనమలూరు నుంచి పోటీ చేస్తారనుకున్నారు.కుప్పం నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారన్నప్రచారం జరిగింది. చంద్రబాబు ఈసారి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని, లోకేష్ కు తమకు పట్టున్న కుప్పం అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నారని కూడా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. అయితే లోకేష్ త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖత చూపడం లేదన్నది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమచారం. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పోటీ చేయకపోవడమే ఉత్తమమని లోకేష్ కు చంద్రబాబు సూచించినట్లు చెబుతున్నారు.ఎన్నికల సమయంలో లోకేష్ సోషల్ మీడియా విభాగంతో పాటు ఎలక్షనీరింగ్ చేసే పనిని కూడా చూడాల్సి ఉంది. వివిధ నియోజకవర్గాల నేతలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉండి తగిన సూచనలు అందివ్వాల్సి ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా లోకేష్ పై ఉంది. ఇంత వత్తిడిలో పెనమలూరు వంటి నియోజకవర్గంలో పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందోనన్న అనుమానం తండ్రీకొడుకుల్లో బయలుదేరిందంటున్నారు. ఈ ఎన్నికల్లో పోటీచేయకుండా దూరంగా ఉంటేనే మేలన్న నిర్ణయానికి లోకేష్ వచ్చినట్లు చెబుతున్నారు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఎక్కడో ఒక చోట నుంచి అక్కడి ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించవచ్చన్న ఆలోచన కూడా లోకేష్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద లోకేష్ ఈసారి ఎన్నికల బరిలో ఉండరని దాదాపుగా స్పష్టమయింది

No comments:

Post a Comment