Breaking News

20/02/2019

చేదెక్కిన చెరకు (చిత్తూరు)

చిత్తూరు, ఫిబ్రవరి 20 (way2newstv.in): చెరకు రైతుకు అన్నింటా కష్టాలే. పంటసాగు ప్రారంభం నుంచే ఆటుపోట్లు ఎదుర్కొంటుండగా.. ఫలసాయం అమ్మి.. సొమ్ము చేసుకుందామనుకుంటే బకాయిల భారం.. ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఏడాది పాటు స్వేదం చిందించి పంట సాగు చేయడం ఒక ఎత్తు అయితే.. దాన్ని నరికి కర్మాగారానికి తరలించేందుకు కూలీల కొరత పెద్ద సమస్యగా మారింది. తీరా తరలించాక బిల్లులు చెల్లించక ఆర్థికంగా నష్టపోతున్నారు.
జిల్లాలో ఒకప్పుడు చెరకు సాగు విస్తీర్ణం దాదాపు 25వేల హెక్టార్లు. నేడు 15వేల హెక్టార్లకు పరిమితమైంది. కష్టపడి పంట పండిస్తే ఒక వైపు గిట్టుబాటు ధరలు దక్కకపోగా.. ఫ్యాక్టరీలు సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదు. వాస్తవానికి చెరకును కర్మాగారానికి తరలించాక 15రోజుల లోపు బిల్లులు చెల్లించాలి. ఆ దిశగా ఏ ఫ్యాక్టరీ కూడా చెల్లించడంలేదు. గతంలో సహకార రంగంలో ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు పరిస్థితి కొంత వరకు మెరుగ్గా ఉండేది. నేడు రెండు కర్మాగారాలు మూత పడడంతో చెరకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.


చేదెక్కిన చెరకు (చిత్తూరు)

జిల్లాలో సాగవుతున్న చెరకు పంటను నరికి ఫ్యాక్టరీలకు తరలించేందుకు సుమారు 1000 మంది కూలీ బృందాలు అవసరం. ప్రస్తుతం 500 బృందాలే ఉన్నాయి. దాంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లాలో ప్రస్తుతం ప్రైవేటు రంగంలో నాలుగు ఫ్యాక్టరీలు మాత్రమే నడుస్తున్నాయి. కొన్ని కర్మాగారాల యాజమాన్యాలు తమిళనాడు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూలీలను రప్పించుకుని రైతులకు పర్మిట్లు ఇచ్చి నరికిస్తున్నారు. మిగిలిన రైతులు సొంతంగా కూలీలను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. ఈ సంవత్సరం టన్ను చెరకు నరికేందుకు కూలీలు రూ.1100 డిమాండ్‌ చేస్తున్నారు. దాన్ని బయటకు తరలించాలంటే రూ.400 వరకు ఖర్చు అవుతోంది. కర్మాగారాలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి టన్నుకు రూ.2715 చెల్లిస్తున్నాయి. అందులో కూలీ ఖర్చులు పోను టన్నుకు రైతుకు రూ.1200లే దక్కుతోంది.
జిల్లాలో నాలుగు కర్మాగారాలు ప్రైవేటు, రెండు సహకార రంగంలో నడిచేవి. సహకారం రంగంలోని చిత్తూరు, గాజులమండ్యం చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ప్రస్తుతం తూర్పు మండలాల్లో రెండు, పశ్చిమ మండలాల్లో రెండు ప్రైవేటు కర్మాగారాలు నడుస్తున్నాయి. పశ్చిమ మండలాల్లో నడుస్తున్న రెండు ఫ్యాక్టరీలు కొద్దినెలల తేడాతో రైతులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నాయి. తూర్పు మండలాల్లోనివి సక్రమంగా ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి చెరకు సరఫరా చేసిన రైతులకు పుత్తూరు సమీపంలోని ఫ్యాక్టరీ సుమారు 500 మందికి రూ.3 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. శ్రీకాళహస్తి సమీపంలోని ఫ్యాక్టరీ నుంచి సుమారు 650 మంది రైతులకు రూ.6కోట్లు వరకు బిల్లులు రావాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. కర్మాగారం వద్దకు వెళ్లి అడిగిన రైతులకు గత వారం రోజులుగా బిల్లులు చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. ఏడాదిగా బిల్లులు రాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment