టిక్కెట్ల ఇస్తామని అభ్యర్ధులకు పిలుపు
హైద్రాబాద్, ఫిబ్రవరి 9, (way2newstv.in)
ఇవాళా నిన్నా పార్టీ కాదు, వందేళ్ళకు పైబడిన పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీలో టికెట్ల కోసం కోలాహలం ఓ స్థాయిలో ఉంటుంది. ఎన్నికలు వచ్చాయంటే చాలు కాంగ్రెస్ అఫీసులు జాతరను తలపిస్తాయి. మొత్తం జనాభా అంతా అక్కడే ఉంటుంది. అక్కడ జరిగే యుధ్దాలు అన్నీఇన్నీ కావు. ఏడుపులు, పెడబొబ్బలు ఒకటేమిటి ఎన్నికల హడావుడి అంతా ఆ పార్టీలోనే ఉంటుంది. అటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇపుడు తలుచుకుంటే నేతల గుండె చెరువు అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో నిశ్శబ్దం తాండవిస్తోంది. పోటీకి కాదు కదా పార్టీలో పదవులు ఇస్తామన్న పట్టించుకునే నాధుడు లేడు. ఈ నేపధ్యంలో మొత్తం సీట్లకు పోటీ చేస్తామంటున్న కాంగ్రెస్ విశాఖలో కొత్త వ్యూహాన్ని అమలుచేస్తోంది.
రండి... బాబు...రండి..
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు రమ్మంటూ ఆ పార్టీ నాయకులు బహిరంగ ఆహ్వానాలు అందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ఏపీలో ప్రత్యేక హోదా వస్తుందని, కేంద్రంలో రేపు అధికారంలోకి వచ్చేది కూడా ఆ పార్టీయేనని భారీ ప్రకటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే సీటుకు, ఎంపీ సీటుకు పోటీ చేసే వారు తమ దరఖాస్తులు పంపుకోవాలని, వాటిని పరిశీలించి టికెట్ ఇస్తామని చెబుతున్నారు. ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం అంటే గొప్పగా భావించాలని కూడా విశాఖ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ లో మిగిలిన ఏకైక సీనియర్ నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ని పార్టీలు వచ్చి పోయినా మిగిలేది కాంగ్రెసేనని అంటున్నారుకాంగ్రెస్ పార్టీకి పదవులు అవసరం లేదని, కానీ ఇపుడు కాంగ్రెస్ అవసరమే ప్రజలకు ఉందని నాయకులు చెబుతున్నారు. దేశంలో మోడీ పాలన పోవాలంటే కాంగ్రెస్ పార్టీకే అంతా మద్దతు ఇవ్వాలని, ఏపీలో టీడీపీ, వైసీపీ కూడా రాహుల్ గాంధీ అభ్యర్ధిత్వాన్ని సమర్ధించాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా జగన్ తన దేశభక్తిని చాటుకోవాలని కూడా పిలుపు ఇస్తున్నారు. ఇది చాలా బాగుంది మరి ఓ వైపు పార్టీ నాయకులంతా విడిచి వెళ్ళిపోతూంటే మరో వైపు వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయమనడం విడ్డూరంగా ఉందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి ఎంతటి కాంగ్రెస్ కు ఎంతటి దుర్గతి ప్రాప్తించిందని కాంగ్రెస్ ఒకనాటి అభిమానులు కూడా వగచి వాపోతున్నారు.
No comments:
Post a Comment