మెదక్, ఫిబ్రవరి 9, (way2newstv.in)
తెలంగాణాకే తలమానికమైన ఏడుపాయల వన దుర్గా క్షేత్ర సన్నిధిలో గంగ జాడ కనుమరుగైంది. వర్షాభావ పరిస్థితులతో మంజీర నదిపై నిర్మించిన సింగూర్ ప్రాజెక్టు నిండకపోవడంతో ఈ యేడాది మహాశివరాత్రి వేడుకలకు ఏడుపాయలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులు నీటి కటకటను చవిచూడటం ఖాయమే. ఈ నెల 4న పవిత్ర మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఘన్‌పూర్ ఆనకట్టకు ఎగువన ఉన్న మడుగుల నుండి నీటిని తోడి దిగువన ఉన్న చెక్‌డ్యాంను నింపారు. చెక్ డ్యాంతో పాటుగా షవర్లు ఏర్పాటు చేసి భక్తులు స్నానాలు ఆచరించేలా ఆలయ కమిటీ చొరవ తీసుకుంది.
వనదుర్గా క్షేత్ర సన్నిధిలో కనిపించని గంగ జాడ
మార్చి 4న మహాశివరాత్రి పర్వదినం రానుండగా అప్పటిలోగా చెక్‌డ్యాంలో ఉన్న నీరు కూడా ఖాళీ కావడమో, లేక నల్లగా మారడమో అవుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. మహాశివరాత్రి అంటే శివుడికి ప్రీతికరమైన రోజున భక్తులు ఉపవాస దీక్షలు ఉంటారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మహాశివరాత్రికి ఏడుపాయల దుర్గ్ భవాని జాతర ఉత్సవాలు కొనసాగడం ప్రత్యేకత అని చెప్పవచ్చు. భక్తులకు త్రాగునీటి సౌకర్యాన్ని ఆలయ కమిటీ ఏర్పాటు చేసినా స్నానాలు, ఇతర అవసరాలకే నీటి ఎద్దడి తప్పని పరిస్థితి ఏడుపాయలలో నెలకొంది. గత యేడాది పుష్కలంగా వర్షాలు కురిసి సింగూర్ ప్రాజెక్టు నిండగా అప్పట్లో ప్రభుత్వం సింగూర్ నుండి దాదాపు 14 టీఎంసీల నీటిని ఎస్‌ఆర్‌ఎస్పీకి తరలించింది. ఈ యేడాది వానలు పడకపోవడంతో సింగూర్ ప్రాజెక్టుకు ఏ మాత్రం నీరు వచ్చి చేరలేదు. ఉన్న నీటితో ఖరీఫ్, రబీ పంటల సాగుకు, త్రాగునీటి అవసరాలకు సమకూర్చగా ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 1.5 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉంది. వేసవి కాలం పూర్తయ్యే సరికి ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయినా ఆశ్చర్యపోనక్కర లేదు. మహాశివరాత్రి వేడుకలకు ఏడుపాయలకు వచ్చే భక్తులకు నీటి ఇబ్బందులు తప్పవని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
No comments:
Post a Comment