Breaking News

08/08/2018

నేషనల్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ జనతా దళ్

న్యూఢిల్లీ, ఆగస్టు 8, (way2newstv.in)
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నగారా మోగింది. రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య నాయుడు ఏకాభిప్రాయం ద్వారా ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించినా.. పాలక కూటమి నుంచి గానీ, ప్రతిపక్షాల నుంచి గానీ ఈ దిశగా ప్రయత్నాలు జరుగడంలేదు. ఈ పదవిని కైవసం చేసుకోవడానికి ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఏ పార్టీకి, కూటమికి స్పష్టమైన మెజారిటీ లేదు. తటస్థ పార్టీల మద్దతు లేకుండా ఎవరూ గట్టెక్కలేని పరిస్థితి. ఎన్డీఏలో ప్రధాన పక్షమైన బీజేపీ.. ఈ పదవిని తన మిత్రపక్షమైన జేడీయూకి ఇవ్వాలని భావిస్తోంది. 



నేషనల్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ జనతా దళ్

ఇందులో భాగంగానే ఎన్డీఏ తమ అభ్యర్థిగా జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్‌ను బరిలోకి దింపుతోంది. సోమవారం లోక్‌సభలో జరిగిన ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యుల ఎన్నికల్లో పోటీ చేసిన ఈయన విపక్షాలు బలపరిచిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేతిలో ఓడిపోయారు. అందుకోసమే డిప్యూటీ చైర్మన్ ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు విపక్షాలు ఈ సారి కూడా కలిసి కట్టుగా నిలిచి గెలవాలని డిసైడ్ అయ్యాయి. ఈ మేరకు ఆ పార్టీలకు చెందిన నేతలు సోమవారం భేటీ అయ్యారు.రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి విపక్షాల అభ్యర్థిగా శరద్‌పవార్ నేషనలలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ఎంపీ వందనా చవాన్ పేరు దాదాపు ఖరారైంది. విపక్షాల ఐక్య అభ్యర్థిగా ఈమెను ఎంచుకోవడం వెనుక బలమైన వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. వందనా చవాన్‌కు విపక్ష పార్టీల నుంచే కాకుండా కొందరు ఎన్డీఏ భాగస్వాముల నుంచి కూడా మద్దతు లభించే అవకాశం ఉందని మంగళవారం జరిగిన మలివిడుత సమావేశంలో విపక్ష పార్టీలు నిశ్చితాభిప్రాయానికి వచ్చాయి. ఇలాంటి తరుణంలో బీజేపీకి ఈ ఎన్నిక అగ్నిపరీక్షలాంటిదే. 89 మంది సభ్యుల ఎన్డీఏ తన అభ్యర్థిని గెలిపించుకోవాలంటే 123 మంది మద్దతు అవసరం. అంటే ఇంకా 34 మంది మద్దతు కావాలి. అన్నాడీఎంకే (13), బీజేడీ (9), టీఆర్‌ఎస్‌ (6), వైసీపీ (2) తనకే సహకరిస్తాయని ఎన్డీఏ భావిస్తోంది. నలుగురు నామినేటెడ్‌ సభ్యులూ ఓటేస్తే అధికారిక అభ్యర్థి విజయం ఖాయంగా కనిపిస్తోంది. సంఖ్యాపరంగా చూస్తే.. ఎన్డీఏ కంటే ప్రతిపక్షాలకే ఎక్కువ మంది సభ్యులు (112 మంది) ఉన్నారు. మరో 11 మంది సహకరిస్తే విపక్ష అభ్యర్థి గెలుపొందుతారు. ఇందుకోసమే విపక్షాలన్నీ చవాన్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే ఎన్డీయేకు మరో ఓటమి తప్పేలా లేదు.

No comments:

Post a Comment