విజయవాడ, జూలై 24 (way2newstv.in)
ఏపీ ప్రత్యేక హోదా కోసం ఏపీలో ఉద్యమాలు మొదలయ్యాయి. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ తర్వాత.. కేంద్రం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పార్టీలన్నీ పోరును ఉధృతం చేశాయి. హోదా సాధనే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు ఇవాళ ఏపీలో బంద్ మొదలయ్యింది. ఈ బంద్‌కు కొన్ని విపక్షాలు మాత్రం మద్దతు తెలపగా.. ఉదయం నుంచి వైసీపీ శ్రేణులు బంద్‌లో పాల్గొంటున్నాయి. కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. కొన్ని జిల్లాల్లో బస్సులన్నీ డిపోలకే పరిమితంకాగా.. నడుస్తున్న సర్వీసుల్ని వైసీపీ కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్‌ల దగ్గర అడ్డుకుంటున్నారు. బంద్‌లో భాగంగా ఆర్టీసీ బస్సుల్ని అడ్డుకోవడంపై పోలీసులు సీరియస్ అవుతున్నారు. బస్టాండ్‌ల దగ్గర 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.
ఏపీలో కొనసాగుతున్నబంద్
బస్సుల్ని అడ్డుకున్న పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా షాపులు మూయించినా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. విజయవాడలో బస్సుల్ని అడ్డుకున్న వైసీపీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. బస్టాండ్ దగ్గర బస్సుల్ని అడ్డుకున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు.. రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి.. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో వైసీపీ నేతల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వైసీపీ బంద్ పిలుపుతో 13 జిల్లాల్లో విద్యాసంస్థలకు ముందుగానే సెలవులు ప్రకటించారు. ఇవాళ జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా వేశారు. కొన్ని దుకాణ సముదాయాలు కూడా స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఇదిలా ఉంటే బంద్‌ను పోలీసులు అడ్డుకోవడంపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ప్రత్యేక హోదాకు చంద్రబాబుగారు, టీడీపీ వ్యతిరేకం కాకపోతే బంద్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
No comments:
Post a Comment