Breaking News

11/07/2018

ఖమ్మంలో కాంగ్రెస్ లో కుమ్ములాటలు

ఖమ్మం, జూలై 11, (way2newstv.in)
వచ్చిన నేత ఎవరైనా తమ వర్గ బలాన్ని చూపించటమే కాంగ్రెస్ నేతల వైఖరి. ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ఎఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ ఎదుట ప్రదర్శించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్‌లలో కొందరు జిల్లా సరిహద్దులోని నాయకన్‌గూడెం వరకు వెళ్ళి స్వాగతం చెప్పగా, మరొక గ్రూప్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి ఆయన రాగానే స్వాగతం చెప్పి నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఎవరి వర్గం వారు వారి నేతకు జిందాబాద్‌లు చెబుతూ నినాదాలు చేశారు. అయితే ఎఐసీసీ కార్యదర్శితో పాటు ఉన్న ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్ దుద్దిల్ల శ్రీ్ధర్‌బాబు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, పోట్ల నాగేశ్వరరావు తదితరులు పార్టీ కార్యాలయంలోకి వెళ్ళారు. అనంతరం నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తామని, తాము చెప్పిన నియోజకవర్గ నేతలు మినహ మిగిలినవారంతా బయటకు వెళ్ళాలని సూచించారు. తొలుత భద్రాచలం నియోజకవర్గం నుండి ప్రారంభమైన సమీక్ష వరుసగా పినపాక, ఆశ్వారావుపేట, ఇల్లందు, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల నేతలతో జరిగింది.



ఖమ్మంలో కాంగ్రెస్ లో కుమ్ములాటలు

 ఎఐసిసి కార్యదర్శి సలీంతో పాటు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, శ్రీ్ధర్‌బాబు, సంభానిలు నేతలతో పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితి, కొత్త నేతలు చేరితే పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు తదితర వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా నియోజకవర్గల పరిధిలోని గ్రూపులు, వాటివల్ల జరుగుతున్న నష్టాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తు వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. కొందరు నేతలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్నదని, అది ఎంతవరకు నిజమని ప్రశ్నించారు. అదే క్రమంలో పార్టీకి అన్యాయం చేసిన వారిని గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఒటమికి కారణమైన వారిని తిరిగి పార్టీలోకి ఎలా తీసుకుంటారని నిలదీశారు. దీనిపై నేతలు మాత్రం పార్టీ నిర్ణయం ప్రకారమే పనిచేయాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ప్రజల్లో కాంగ్రెస్ పట్ల బలమైన నమ్మకం ఉన్నదని దానిని నిలుపుకోవల్సిన బాధ్యత నేతలదేనన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన నేతలుగా ఉన్నవారు కూడా గ్రూపులను ప్రోత్సహించటం సరైందికాదన్నారు. గ్రూపు రాజకీయలకు స్వస్థి చెప్పాలని, ఇతర పార్టీల నుండి కాని, తటస్థులు కాని పార్టీలు చేరితే ఆహ్వనించాలని, పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయవద్దని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రధాన నేతల వైఖరి వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించారు. గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లందు, వైరా నియోజకవర్గాల నుండి భారీగా కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. కొత్తగూడెంకు చెందిన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు 5 బస్సులలో తన అనుచరులను ఖమ్మంకు తరలించారు.

No comments:

Post a Comment