Breaking News

11/07/2018

అనంతపురంలో ఎన్నికల సందడి

అనంతపురం, జూలై 11, (way2newstv.in)
ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో రాష్ట్రంలోని వివిధ పార్టీలు వివిధ రూపాల్లో ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, పార్టీలు చేపడుతున్న వివిధ కార్యక్రమాల ప్రభావంతో అనంతపురం జిల్లా రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి. ఫలితంగా రానున్న మూడు, నాలుగు నెలల్లో జిల్లా రాజకీయ ముఖచిత్రం కూడా మారబోతోంది. క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే క్రమంలో భాగంగా జిల్లాలో పాగా వేసేందుకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జిల్లాలో పర్యటించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 



అనంతపురంలో ఎన్నికల సందడి

మరోవైపు రాష్ట్ర విభజనతో అడ్రస్ గల్లంతైన జాతీయ పార్టీ కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో ఉనికి చాటుకోవడానికి పాత నేతల్ని, జిల్లా నాయకుల్ని కలుపుకునేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది.పీసీపీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అనంతపురం జిల్లా వాసి కావడంతో పార్టీ వీడిన నేతలను సమీకరించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ ఈనెల 23న అనంతపురం జిల్లా పర్యటనకు రానున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘వంచనపై నిరసన దీక్ష’ చేపట్టింది. అదే సమయంలో సీపీఐ జాతీయ నేతలు కూడా జిల్లాలో పర్యటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెలలోపు జిల్లాలో పర్యటించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.టీడీపీ నవ నిర్మాణదీక్ష, ఏరువాక, ఇంటింటికీ టీడీపీ వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు పేరుతో చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షల ప్రభావం కూడా అనంతపై పడింది. కేంద్రంపై వత్తిడి కొనసాగింపులో భాగంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరుతో టీడీపీ ఎంపీలు చేపట్టిన ధర్మ పోరాటదీక్ష  అనంతపురంలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని పార్టీలూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఎత్తుగడలు, వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాలు అనంతపై ప్రభావం చూపుతుండటంతో పార్టీల పొత్తులు, టికెట్ల కేటాయింపు విషయంలో స్పష్టత కోసం అధిష్టానం నిర్ణయంపై ఆధారపడుతున్నారు. ఎవరికి టికెట్ వస్తుందో, ఎవరికి రాదోనన్న ఆందోళన జిల్లా టీడీపీ నేతలను వెంటాడుతున్నా, నియోజకవర్గాల్లో చురుగ్గా పాల్గొంటుండటం గమనార్హం.

No comments:

Post a Comment