Breaking News

07/07/2018

ఏసీబీ వలలో నీటిపారుదల శాఖ కృష్ణా బేసిన్ చీఫ్ ఇంజినీర్

హైద్రాబాద్, జూలై 7 (way2newstv.in)
నీటిపారుదల శాఖ కృష్ణా బేసిన్ చీఫ్ ఇంజినీర్ సురేశ్‌కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. సోమాజిగూడలోని తన నివాసంతో పాటు కూకట్‌పల్లి, ముసారాంబాగ్, మెట్టుగూడ, ఎర్రమంజిల్, కరీంనగర్‌లోని సురేశ్ స్వగృహంతో పాటు ప్రొద్దుటూరులోని బంధువుల నివాసాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. కరీంనగర్‌లో రెండు ప్లాట్లు, పది ఇళ్ల స్థలాలు, రెండు ఇళ్లను గుర్తించారు. రూ. 18 లక్షల ఎఫ్‌డీలు, కరీంనగర్‌లో 4 బ్యాంకు లాకర్లు, విలువైన బంగారు ఆభరణాలు, నగదును అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు రూ. 10 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. బ్యాంకు లాకర్స్ తెరవాల్సి ఉందన్నారు. ఆస్తులన్నీ తన కుమారుడికి సంబంధించినవి అని చీఫ్ ఇంజినీర్ సురేశ్ కుమార్ తెలిపారు. తన కుమారుడు, కోడలు అమెరికాలో నివాసం ఉంటున్నారని చెప్పారు. ఎన్‌ఆర్‌ఐగా తన కుమారుడు సంపాదించిన ఆస్తులు ఇవి అని సురేశ్ స్పష్టం చేశారు. నాలుగు లాకర్స్‌లో ఒకటి తనది, మరొకటి తన భార్యది అని పేర్కొన్నారు. మిగతా రెండు కుమారుడు, కోడలివి అని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఓ ఇల్లు మాత్రమే కొన్నాను అని స్పష్టం చేశారు. ఆఫీస్‌కు దగ్గరగా ఉంటుందనే సోమాజిగూడలో ఉంటున్నాను. ఇంట్లో ఉన్న ఫర్నీచర్ మొత్తం రెంట్‌కు తీసుకువచ్చిందే అని సురేశ్ తెలిపారు. తనపై ఏసీబీ దాడులను న్యాయపరంగా ఎదుర్కొంటానని చీఫ్ ఇంజినీర్ పేర్కొన్నారు.



ఏసీబీ వలలో నీటిపారుదల శాఖ కృష్ణా బేసిన్ చీఫ్ ఇంజినీర్

No comments:

Post a Comment