Breaking News

03/07/2018

సెకండ్‌ ఇన్నింగ్స్ కు రెడీ అవుతున్న హర్షకుమార్

అమలాపురం, జూలై 3, (way2newstv.in)
ఏపీ విభజన కాంగ్రెస్ నేతల తలరాతలు మార్చేసింది. వన్ అండ్ ఓన్లీ లీడర్ గా మంచి చరిష్మా వున్న వైఎస్ అకాలమరణం నుంచి ఏపీ కాంగ్రెస్ ఎదుర్కొన్న కష్టాలు ఏ పార్టీ కి లేవేమో. పార్టీ సంగతి దేవుడెరుగు గొప్ప గొప్ప లీడర్లు డమ్మీలుగా, దోషులుగా ప్రజలముందు నిలవాలిసిన దుస్థితి దాపురించింది. విభజన వద్దు బాబోయి అన్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం నేతల మాట వినలేదు. తెలంగాణ లో అధికారం హస్తగతం అయితే చాలన్న ధోరణిలోనే ముందుకు సాగింది. విభజనపై పోరాటం చేసిన ఎంపిలను పార్టీనుంచి ఏకంగా బహిష్కరించింది. ఫలితం అందరికి తెలిసిందే … అడ్రస్ ఎక్కడో కూడా తెలియని రీతిలో కాంగ్రెస్ జీరో అయిపొయింది.దశాబ్దాలపాటు ఏపీలో చక్రం తిప్పిన కాంగ్రెస్ లోని టాప్ లీడర్లు అంతా గత్యంతరం లేక ఎదో ఒక పార్టీలోకి దూకి తమ ఉనికి కాపాడుకున్నారు. ఎంపీలు ఎమ్యెల్యేలుగా ఒక వెలుగు వెలిగి ఏ పార్టీలోకి పోకుండా వున్న వారంతా చీకటిలోకి వెళ్ళిపోయారు. అధిష్టానం వైఖరి ని నిరసిస్తూ జై సమైక్యాంధ్ర పార్టీ ని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సారధ్యంలో స్థాపించిన నేతలు అంతా డిపాజిట్లు సైతం గల్లంతు అయ్యేలా కనుమరుగయ్యారు. సెకండ్‌ ఇన్నింగ్స్ కు రెడీ అవుతున్న హర్షకుమార్

ఆ కోవలోనే అమలాపురం మాజీ ఎంపి జివి హర్ష కుమార్ సైతం దెబ్బతినేశారు. పుట్టి పెరిగిన కాంగ్రెస్ తో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న నేతల్లో ఆయన కూడా ఒకరు. కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందిని అమలాపురం కి పదేళ్ళు ఎంపీగా పనిచేసిన జివి హర్ష కుమార్ కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ బహిష్కృత ఎంపీల్లో ఒకడిగా 2014 ఎన్నికల్లో జై సమైక్య ఆంధ్ర పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి ఘోరపరాజయం చవిచూసిన హర్ష కుమార్ ఆ తరువాత దళిత ఉద్యమాలు నిర్మిస్తూ వచ్చారు. వీలుచిక్కినప్పుడల్లా అన్ని పార్టీలను ఉతికేస్తూ వచ్చారు. ఆయన జనసేన, వైసిపిలలో ఎదో ఒక పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా వినిపించింది. టిడిపి సైతం హర్ష కుమార్ కి బంపర్ ఆఫర్ నే ప్రకటించింది. ఇన్ని అవకాశాలు వున్నా తనకు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ వైపే హర్ష కుమార్ మొగ్గు చూపినట్లు తెలియవస్తుంది. రాజీవ్ గాంధీపై వున్న ప్రేమతో తన కళాశాలకు సైతం ఆయన పేరే పెట్టారు.స్వేచ్ఛాయుతంగా వుండే కాంగ్రెస్ లో కొనసాగడమే మంచిదన్న ఆలోచనను హర్ష చేసినట్లు ఆయన చర్యలు సూచిస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఉమెన్ చాందీకి ప్రత్యేకబాధ్యతలు అధినేత రాహుల్ అప్పగించడంతో ఆయన పార్టీని వీడినవారిని కలిసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా ముందుగా సీనియర్ కాంగ్రెస్ నేతలు పాలడుగు వెంకట్రావు, పాల్వాయి గోవర్ధన రెడ్డి కుటుంబాలను చాందీ కలిశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇంటికి వెళ్ళి కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇదే క్రమంలో హర్ష కుమార్ సైతం చాందీ తో భేటీ అయ్యారు. వీరిద్దరినడుమ జరిగిన చర్చలు హర్ష కుమార్ తిరిగి కాంగ్రెస్ జండాతో ఏక్టివేట్ కావాలనే కోరినట్లు తెలియవస్తుంది.హర్ష కుమార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత చురుకైన నేతగా ఎదిగారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆయన రాజకీయాలు మొదలు పెట్టి అతి చిన్నవయస్సులోనే పాయకరావు పేట ఎమ్మెల్యేగా పార్టీ తరపున పోటీ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. రాజమండ్రి మేయర్ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ పడి వేయి ఓట్ల తేడాతో టిడిపి అభ్యర్థి ఎం ఎస్ చక్రవర్తి పై ఓడిపోయారు. కట్ చేస్తే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ ను కాదనుకుని మరీ అమలాపురం పార్లమెంట్ సీటు కేటాయించడం పదేళ్ళు పాటు హర్ష కుమార్ ఎంపిగా కొనసాగడం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో ఆయన తనతో పాటు హర్ష పెద్ద కుమారుడు జై సమైఖ్యఆంధ్ర లో గన్నవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా తనకు తన కుమారుడికి టికెట్ల అంశాన్ని సైతం చాందిని తో చర్చించారని టాక్. అందుకోసమే ఆయన ప్రస్తుతం జోరు మీద వున్న ఏపార్టీ లో కూడా చేరకుండా చాలా ఏళ్ళు నానుస్తూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుని ఈనెల మొదటి వారంలో కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు జాయిన్ అవుతారని పలువురు భావిస్తున్నారు. అదే నిజమైతే అమలాపురం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి హర్ష కుమార్ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినట్లే.

No comments:

Post a Comment